బుధవారం 02 డిసెంబర్ 2020
Business - Nov 01, 2020 , 02:00:13

నిర్మల వర్సెస్‌ గార్గ్‌

నిర్మల వర్సెస్‌ గార్గ్‌

  • నా ముందస్తు రాజీనామాకు సీతారామనే కారణం
  • ఆమెతో పనిచేయడం చాలా కష్టం
  • నా బదిలీ కోసం చాలా ప్రయత్నించారు
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై మాజీ ఆర్థిక కార్యదర్శి గార్గ్‌ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో బ్యూరోక్రాట్లకున్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మొన్న రఘురామ్‌ రాజన్‌.. నిన్న ఊర్జిత్‌ పటేల్‌, విరల్‌ ఆచార్య.. నేడు సుభాష్‌ చంద్ర గార్గ్‌. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆర్థిక శాఖ నుంచి తనను ఎప్పుడెప్పుడు వెళ్లగొడదామా? అని నిర్మల చూసేవారని శనివారం గార్గ్‌ ఆరోపించారు. ముందస్తు పదవీ విరమణకు దారితీసిన కారణాలను గార్గ్‌ తన బ్లాగ్‌లో వివరించారు. నిర్మలా సీతారామన్‌.. అరుణ్‌ జైట్లీ మాదిరి కాదని, ఆమెది ఓ విచిత్రమైన వ్యక్తిత్వమని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై నిర్మలకు ఏమాత్రం అవగాహన లేదని వ్యాఖ్యానించారు. ఆర్థికపరమైన విధానాల్లో ఆమె అవివేకం తెలుసుకోవడానికి తనకు ఎంతో సమయం పట్టలేదన్నారు. ప్రతీ విషయంలో ఇతరులపై ఆధారపడే స్వభావమని పేర్కొన్నారు. అయితే జైట్లీని మాత్రం చాలా తెలివైన ఆర్థిక మంత్రిగా అభివర్ణించారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. గతేడాది తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మూడు వారాల్లోనే గార్గ్‌ ఆర్థిక కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

నన్ను నమ్మేవారు కాదు

‘నేను గతేడాది జూలై 24న వాలంటరీ రిటైర్మెంట్‌ను ఎంచుకున్నాను. 26న పదవీ విరమణ చేశాను. అక్టోబర్‌ 31న విద్యుత్‌ మంత్రిత్వ శాఖలోకి బదిలీ కావాల్సి ఉన్నా.. జూలై 24నే వెళ్లిపోయాను. నాడు నా బదిలీ వెనుక ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పెద్దలెవరూ లేరని చెప్పాను. నా రిటైర్మెంట్‌ కోసం జూలై 18నే ప్రధాన మంత్రి కార్యాలయంతో చర్చించానని తెలిపాను. కానీ నిజం వేరే.’ అంటూ నాటి పరిస్థితులను గార్గ్‌ గుర్తుచేసుకున్నారు.

జైట్లీ హయాంలోనే గార్గ్‌ అన్నీ తానై ఆర్థిక శాఖను నడిపించిన సంగతి విదితమే. కానీ జైట్లీ అనంతరం వచ్చిన నిర్మలా సీతారామన్‌.. తనపై అపనమ్మకంతోనే ఆర్థిక  శాఖలోకి అడుగు పెట్టారన్నారు. తన గురించి ఆమెకు కొన్ని చెడు అభిప్రాయాలున్నాయని, అందుకే నమ్మేవారు కాదని, అసౌకర్యంగా పనిచేసేవారని గార్గ్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి ఆర్బీఐ మిగులు నగదు నిల్వల నుంచి డివిడెండ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్యాకేజీ, ఐఐఎఫ్‌సీఎల్‌ వంటి ఎన్‌బీఎఫ్‌సీలకు మూలధన సాయం వంటి కీలక అంశాలపై సీతారామన్‌తో తీవ్రమైన విభేదాలు తలెత్తాయన్నారు. చివరకు నిరుడు జూన్‌లో వేరే మంత్రిత్వ శాఖకు బదిలీ కావాలని తనను కోరినట్లు గార్గ్‌ చెప్పారు. అయితే తనకు ఇతర శాఖల్లో పనిచేయడం ఇష్టం లేదని, అందుకే బడ్జెట్‌ అనంతరం వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నానని తెలియజేశారు. 10 లక్షల కోట్ల డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి అనువైన సంస్కరణలను తీసుకునే సామర్థ్యం ఆమెకు లేదన్నారు. ఈ విమర్శలపై స్పందించేందుకు ఆర్థిక శాఖ, నిర్మలా సీతారామన్‌ కార్యాలయం నిరాకరించాయి.