శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Feb 11, 2020 , 23:50:38

ముప్పేమీ లేదు

ముప్పేమీ లేదు
  • దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నది
  • సంస్కరణల ఫలాలు కనిపిస్తున్నాయి
  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఏమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణల ఫలాలు కనిపిస్తున్నాయని చెప్పారు. నిర్ణీత సమయంలో భారత జీడీపీ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభలో మంగళవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో నిర్మల మాట్లాడారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయని, గడిచిన మూడు నెలల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.లక్షకుపైగా నమోదవుతున్నాయని, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) కూడా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. విదేశీ మారకపు నిల్వలు ఆల్‌టైమ్‌ హైలో ఉన్నాయన్న ఆమె.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ఉందని వివరించారు. 


చిదంబరం వ్యాఖ్యలపై..

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపట్ల ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు కారణమైన గత యూపీఏ ప్రభుత్వ పాలకుల నుంచి నీతులు నేర్చుకునే దుస్థితిలో తాము లేమన్నారు. ఆర్థిక వ్యవస్థ ఐసీయూను దాటిపోతున్నదని, అయినప్పటికీ మోదీ సర్కారు అసమర్థ వైద్యులతోనే చికిత్స చేయిస్తున్నదని పరోక్షంగా నిర్మలా సీతారామన్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో సమర్థులైన వైద్యుల పర్యవేక్షణలోనే ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తులు)కు కారణం యూపీఏ సర్కారేనని మండిపడ్డారు.


వినియోగ సామర్థ్యంపై..

మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధతను పారద్రోలేందుకు, వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పంటల కనీస మద్దతు ధరను పెంచామని, వర్తకుల కోసం పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించామని, జీఎస్టీ రేట్లను తగ్గిస్తున్నామని, కార్పొరేట్‌ పన్నును తగ్గించడమేగాక, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ను కార్పొరేట్లపై ఎత్తివేశామని వివరించారు. ఇదిలావుంటే ఫిస్కల్‌ రెస్పాన్సిబులిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ చట్టాన్ని గౌరవిస్తామని మంత్రి తెలియజేశారు.


logo