సోమవారం 30 మార్చి 2020
Business - Feb 19, 2020 , 00:35:58

భయాలు అక్కర్లేదు

భయాలు అక్కర్లేదు
  • కరోనా నేపథ్యంలో పరిశ్రమకు కేంద్రం అభయం
  • త్వరలోనే సమర్థవంతమైన చర్యలు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
  • వైరస్‌ విస్తృతిపట్ల వ్యాపార, పరిశ్రమ వర్గాలతో సమీక్షా సమావేశం

న్యూఢిల్లీ/శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 18: దేశీయ పరిశ్రమపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం త్వరలోనే పలు చర్యలను తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. చైనాలో విలయం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్‌.. దేశీయ పరిశ్రమను ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నదానిపై, ప్రస్తుత పరిస్థితులపై వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో మంత్రి మంగళవారం ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫార్మా, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ హార్డ్‌వేర్‌, సోలార్‌, ఆటో, సర్జికల్‌ ఎక్విప్‌మెంట్‌, పెయింట్‌, ఫర్టిలైజర్‌, టెలికం, గ్లాస్‌, మొబైల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, వంట నూనెలు, షిప్పింగ్‌, టూరిజం రంగాల ప్రతినిధులు దీనికి హాజరైయ్యారు. సమావేశం అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ ఔషధ, సౌర, రసాయన పరిశ్రమల నుంచి కొన్ని రకాల ఆందోళనలు వినిపిస్తున్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఎగుమతులు, ముడి సరుకు దిగుమతుల సమస్యలను తమ దృష్టికి తెచ్చారన్నారు.


 ప్రధాన మంత్రి కార్యాలయంతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కాగా, బుధవారం వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో తాను సమావేశం అవుతానని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆ తర్వాత తగిన చర్యలను ప్రకటిస్తామని చెప్పారు. కాగా, వివిధ రకాల ఉత్పత్తుల ధరల పెరుగుదల గురించి ఆందోళనలు అవసరం లేదన్న నిర్మలా సీతారామన్‌.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’పై కరోనా ప్రభావం గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఔషధాలు, వైద్య పరికరాల కొరత ఏమీ లేదన్నారు. అయితే చైనాలో ఇప్పుడున్న భయానక పరిస్థితులు ఇలాగే మరికొంతకాలం కొనసాగితే కీలక ఔషధాల ధరలు పెరుగవచ్చని జైడస్‌ గ్రూప్‌ చైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ అన్నారు. అక్కడి నుంచి వచ్చే దిగుమతులు ఇలాగే ఆగిపోతే ఇబ్బందులేనన్నారు.


ఆసియా-పసిఫిక్‌ వృద్ధి ఢమాల్‌

ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో ఈ ఏడాది వృద్ధిరేటు తగ్గనుందని ప్రముఖ గ్లోబల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అంచనా వేసింది. చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం వల్లేనని తెలిపింది. ఈ అంటువ్యాధి దెబ్బకు ప్రపంచ తయారీ కేంద్రంగా విరాజిల్లుతున్న చైనాలో వేలాది పరిశ్రమలు ఒక్కసారిగా మూతబడ్డాయి. ఈ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని ఇతర దేశాలపైనా ఉంటుందని, దీంతో ఆయా దేశాల జీడీపీ పడిపోవచ్చని మూడీస్‌ పేర్కొంది. చాలా దేశాలకు చైనా నుంచే ముడి ఉత్పత్తులు ఎగుమతి అవుతుండటంతో ఇప్పుడవన్నీ దాదాపు ఆగిపోయాయి. ఫలితంగా వాటి ఆధారంగా నడిచే వివిధ రకాల పరిశ్రమలు నిలిచిపోతున్నాయి. కాగా, ఇప్పటిదాకా ఈ మహమ్మారి తీవ్రతకు 1,860 మందికిపైగా మృతిచెందగా, 72వేలకుపైగా బాధితులైయ్యారు.


ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమకు దెబ్బ

చైనాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్‌.. ఆ రంగం, ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలనూ కుదిపేస్తున్నది. విమానయాన పరిశ్రమనూ కరోనా వేధిస్తుండగా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా సంస్థలు తమ సర్వీసులను తగ్గించేస్తున్నాయి. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తమ విమానాల సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా తగ్గించేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ముంబై, ఫ్రాంక్‌ఫర్ట్‌, జకార్తా, లండన్‌, లాస్‌ఏంజిల్స్‌, పారిస్‌, సియోల్‌, సిడ్నీ, టోక్యో తదితర నగరాలు, ప్రాంతాలకు మే నెలదాకా విమాన సర్వీసులు తగ్గిపోతాయని స్పష్టం చేసింది. మరోవైపు వైరస్‌ను అంతమొందించేందుకు సింగపూర్‌ తమ ఆర్థిక ప్యాకేజీల్లో 4.6 బిలియన్‌ డాలర్లను కేటాయించింది. ఈ దేశంలో 77 కేసులు నమోదైయ్యాయి.


ఎల్‌ఈడీ బల్బుల ధరలు ప్రియం

ఎల్‌ఈడీ బల్బులు, లైట్ల ధరలు వచ్చే నెల మార్చి నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా చైనా నుంచి భారత్‌కు ఎలక్ట్రానిక్‌ కంపోనెంట్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. కరోనా భయాలతో చైనా ఎలక్ట్రానిక్‌ కంపోనెంట్ల తయారీ పరిశ్రమ మూతబడింది. దీంతో మార్కెట్‌ డిమాండ్‌ను తయారీదారులు అందుకోలేని పరిస్థితి వస్తుండగా, ఈ క్రమంలో పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, ఇబ్బందుల దృష్ట్యా ధరలు పెరిగే వీలుందని పరిశ్రమ సంఘం ఎల్కోమా అంటున్నది. మొబైల్‌, టెలివిజన్‌, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలను, దేశీయ లైటింగ్‌ పరిశ్రమనూ కరోనా వైరస్‌ ప్రభావితం చేస్తున్నదని ఎల్కోమా ఉపాధ్యక్షుడు సుమిత్‌ పద్మాకర్‌ జోషి పీటీఐ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.


ఐఫోన్‌కు సెగ

ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో తమ ఆదాయ లక్ష్యాలు నెరవేరకపోవచ్చని యాపిల్‌ అంటున్నది. కరోనా వైరస్‌ ఐఫోన్‌ సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నదని తాజాగా పేర్కొన్నది. చైనాలో తమ భాగస్వామ్య సంస్థలున్నాయని, కరోనా కారణంగా వాటి తయారీ కేంద్రాలు మూతబడ్డాయని, ఈ పరిణామం ఐఫోన్‌ తయారీపై పడుతున్నదని వెల్లడించింది. ఇక ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా రవాణా వ్యవస్థలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే వరల్డ్‌ మొబైల్‌ క్రాంగెస్‌, ఆటో షోలతోపాటు పలు క్రీడా సంరంభాలకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. ఒక దేశం నుంచి మరో దేశానికి కరోనా వ్యాప్తి చెందవచ్చన్న భయాలు వెంటాడుతున్నాయి మరి. ఐఫోన్‌ విక్రయాల్లో చైనా మార్కెట్‌ కూడా కీలకమవగా, వైరస్‌ దెబ్బకు అక్కడి అమ్మకాలు అటకెక్కాయి. ఇది కూడా సంస్థ ఆదాయ లక్ష్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.


logo