మంగళవారం 07 ఏప్రిల్ 2020
Business - Feb 02, 2020 , 23:56:48

కొందరికైతే లాభమే

కొందరికైతే లాభమే
  • కొత్త పన్ను విధానంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కొత్త ఆదాయం పన్ను (ఐటీ) విధానాన్ని నిపుణులు సంక్లిష్టంగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు నూతన పద్ధతి తప్పక లాభదాయకమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను శనివారం పార్లమెంట్‌లో మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పుడున్న పన్ను విధానాన్ని కొనసాగిస్తూనే.. మరో కొత్త విధానాన్ని ప్రతిపాదించిన సంగతి విదితమే. అయితే ఈ ప్రతిపాదనపై ఐటీ, ఆర్థిక నిపుణుల నుంచి పెదవి విరుపులు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తమ బడ్జెట్‌ ప్రతిపాదనపై మంత్రి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అవసరమైతే కొత్త ఐటీ విధానంపై ప్రభుత్వమే మరింత స్పష్టత ఇస్తుందన్నారు. ‘శనివారమే ఈ అంశంపై కొన్ని విషయాల్లో స్పష్టత ఇచ్చాం. ఈరోజు మరిన్ని అనుమానాలను నివృత్తి చేస్తున్నాం. 


పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా కట్టాల్సి వస్తే.. అసలు ఎందుకీ విధానాన్ని పరిచయం చేస్తాం’ అని ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అందరికీ కాకపోయినా కొందరికైతే కొత్త పథకం లాభమేనన్నారు. నూతన విధానంలో ఎలాంటి మినహాయింపులుండవని పునరుద్ఘాటించిన మంత్రి.. కొన్ని మినహాయింపులను కలగలిపే కొత్త పథకాన్ని తెచ్చామన్నారు. తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదన్న కేంద్రం.. రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలదాకా గతంలో మాదిరిగానే 5 శాతం పన్ను వేసింది. అయితే రూ.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10 శాతం, రూ.7.5 లక్షల నుంచి 10 లక్షలదాకా 15 శాతం, రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 లక్షల నుంచి 15 లక్షలదాకా 25 శాతం, రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్నును ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడున్న విధానంలోనే కొనసాగడమా?.. కొత్త విధానంలోకి మారడమా?.. అన్నదానిపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని మంత్రి చెప్పారు. కొత్త విధానంతో రూ.40 వేల కోట్ల వార్షిక ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతున్నదని గుర్తుచేశారు.


మార్చి ఆఖర్లోగా రెండో విడుత

రెండో విడుత రుణ ఆధారిత ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) బాండ్ల జారీ వచ్చే నెలాఖర్లోగా ఉండే అవకాశాలున్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తొలి విడుత ఈటీఎఫ్‌ బాండ్ల జారీ ఇటీవలే జరుగగా, దానికి పెద్ద ఎత్తున స్పందన లభించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ సెక్యూరిటీలతో కొత్త రుణ ఈటీఎఫ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయాలని తాజా బడ్జెట్‌లో మంత్రి ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే మార్చి చివర్లోగా మలి విడుత ఈటీఎఫ్‌ బాండ్ల జారీ ఉండొచ్చని చెప్పారు. గతేడాది డిసెంబర్‌లో భారత్‌ బాండ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ లేదా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దేశంలో ఇది తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ కావడం విశేషం.


ఎన్నారై ట్యాక్స్‌పై స్పష్టత..

ప్రవాస భారతీయుల (ఎన్నారై)పై బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ ప్రతిపాదనపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నారైల విదేశీ ఆదాయంపై పన్ను వేయబోమని, అయితే భారత్‌లో వారి ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందేనని చెప్పారు. అనంతరం ఆదాయం పన్ను (ఐటీ) శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో మిడిల్‌ఈస్ట్‌, ఇతర పన్ను రహిత దేశాల్లో పనిచేస్తున్న బోనఫైడ్‌ ఎన్నారై వర్కర్లకు ఎన్నారై ట్యాక్స్‌ వర్తించదని స్పష్టం చేసింది. రెవిన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే సైతం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పన్ను వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకుని పన్ను ఎగవేతలకు పాల్పడే అక్రమార్కులపై కొరడా ఝుళిపించాలనే ఎన్నారై ట్యాక్స్‌ను తెచ్చినట్లు చెప్పారు. ఇక ఎన్నారైల నిర్వచనాన్నీ సవరించారు. ఇంతకుముందు 183 రోజులు లేదా 6 నెలలు దేశంలో ఉండని భారతీయులను ఎన్నారైలు అనేవారు. ఇప్పుడు 245 రోజులకు పెంచారు. 


logo