బుధవారం 03 జూన్ 2020
Business - Apr 07, 2020 , 23:34:05

హమ్మయ్య!

హమ్మయ్య!

-లాభాలతో కళకళలాడిన స్టాక్‌ మార్కెట్లు

-సెన్సెక్స్‌ 2,476,నిఫ్టీ 708 పాయింట్లు లాభం

-రూ.7.71 లక్షల కోట్లుపెరిగిన సంపద

ముంబై, ఏప్రిల్‌ 7: కరోనా వైరస్‌తో కుప్పకూలిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలతో కళకళలాడాయి. కరోనాతో దేశం అతలాకుతలమవుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ప్రారంభం నుంచే లాభాల బాటపట్టిన సూచీలు ఏ దశలోనూ వెనక్కితిరిగి చూసుకోలేదు. వరుసగా మూడు రోజుల తర్వాత ఆరంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 30 వేల మార్క్‌ను దాటింది. చివరకు 2,476.26 పాయింట్లు లేదా 8.97 శాతం లాభపడి 30,067.21 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 708.40 పాయింట్లు లేదా 8.76  శాతం అందుకొని 8,792.20 వద్ద ముగిసింది. మే 2009 తర్వాత ఇంతటి స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి.  వరుసగా రెండు రోజులుగా భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకోవడంతో మదుపరుల సంపద అమాంతం పెరిగింది. మంగళవారం వీరి సంపద రూ.7,71,377.02 కోట్లు పెరిగి రూ.1,16,38,099.98 కోట్లకు ఎగబాకింది. మహావీర్‌ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు సెలవుపాటించాయి. 

  • 30 షేర్ల ఇండెక్స్‌లో అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. వీటిలో 14 రంగ షేర్లు పదిశాతానికి పైగా లాభపడ్డాయి.
  • ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతి, నెస్లె, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌, హీరో, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు పదిశాతానికి పైగా లాభపడ్డాయి. 
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 12 శాతం లాభపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.81 వేల కోట్లు పెరిగింది. 
  • రంగాలవారీగా చూస్తే బ్యాంకెక్స్‌, ఇంధనం, వాహన, టెలికం, టెక్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగ సూచీలు పదిశాతానికి పెరిగాయి. 
  • బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు 5.40 శాతం వరకు ర్యాలీని సాధించాయి.
  •  బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 3 శాతానికి పైగా పెరుగడం అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి.
  • రూపాయి మారకం విలువ 49 పైసలు పెరిగి 75.46 వద్ద ముగిసింది. 


logo