ఆదివారం 24 మే 2020
Business - Mar 26, 2020 , 23:35:55

మార్కెట్లకు ప్యాకేజీ కిక్కు

మార్కెట్లకు ప్యాకేజీ కిక్కు

-సెన్సెక్స్‌ 1,411, నిఫ్టీ 324 పాయింట్ల లాభం

ముంబై, మార్చి 26: కరోనా వైరస్‌తో కుదేలవుతున్న దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ స్టాక్‌ మార్కెట్లో లాభాల పంట పండించింది. వరుసగా మూడోరోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రారం భం నుంజి జోష్‌మీదున్న సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1.7 లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు ఈ లాభాలను మరింత పెంచాయి. గురువారం బీఎస్‌ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 1,410.99 పాయిం ట్లు లేదా 4.94 శాతం లాభపడి 29,946.77 వద్ద ముగిసింది. 29,074 వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 30 వేల మార్క్‌ను దాటింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా మరో 323.60 పాయింట్లు(3.89 శాతం) అందుకొని 8,641.45 వద్ద స్థిరపడింది. ఈవారం ప్రారంభంలో కుప్పకూలిన సూచీలు ఆ మరుసటి రోజు నుంచి భారీగా కోలుకుంటున్నాయి. గడిచిన మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 3,965.63 పాయింట్లు (15.26శాతం), నిఫ్టీ 1,031.20 పాయింట్లు (13.55 శాతం) చొప్పున బలపడ్డాయి. 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ జోరు

గత కొన్ని రోజులుగా పాతాళంలోకి పడిపోయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు తిరిగి కోలుకున్నది. బ్యాంక్‌ చైర్మన్‌ పదవి విరమణ చేయనున్నట్లు ప్రకటించిన నాటి నుంచి పతనం దిశగా కొనసాగిన బ్యాంక్‌ షేరు ధర గురువారం ఏకంగా 45 శాతానికి పైగా లాభపడి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, టైటాన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లె, మహీంద్రా, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్బీఐ, ఎన్‌టీపీసీలు లాభపడ్డాయి. మరోవైపు మారుతి, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు మాత్రం నష్టపోయాయి.  రంగాలవారీగా చూస్తే టెలికం, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు 10 శాతం వరకు లాభపడ్డాయి. 1,508 షేర్లు లాభపడగా, 769 షేర్లు నష్టపోయాయి.  ఉద్దీపన ప్యాకేజీ సామాన్యుడిని లక్ష్యంగా చేసుకొని ప్రకటించినట్లుగా ఉన్నదని, పారిశ్రామిక రంగానికీ కావాలని ఇండస్ట్రీలు కోరుతున్నాయి.  

11 లక్షల కోట్లు పెరిగిన సంపద

స్టాక్‌ మార్కెట్లు భారీగా పుంజుకుంటుండటంతో మదుపరుల సంపద కూడా అంతే వేగంతో పెరుగుతున్నది. గడిచిన మూడు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.11 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వరుసగా మూడు రోజు ల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 4 వేల పాయింట్ల వరకు లాభపడటంతో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.11,12,088.78 కోట్లు పెరిగి రూ.1,12,99,025.06 కోట్లకు చేరుకున్నది. 

కోలుకుంటున్న రూపాయి

దేశీయ కరెన్సీ  మరింత బలపడింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో ఈక్విటీలు, రూపాయిలు భారీగా పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మార కం విలువ ఒకేరోజు 78 పైసలు లాభపడి 75.16 వద్దకు చేరుకున్నది. 75.90 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఇంట్రాడేలో 75.10 గరిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం కూడా కరెన్సీ విలువ 26 పైసలు పెరిగిన విషయం తెలిసిందే. అమెరికా, భారత్‌తోపాటు ఇతర దేశాలు కూడా భారీ ప్యాకేజీలు ప్రకటించడంతో కరెన్సీలు మరింత బలపడ్డాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. 


logo