ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 29, 2020 , 00:48:46

మార్కెట్‌ను వీడని వైరస్‌

మార్కెట్‌ను వీడని వైరస్‌
  • వెంటాడిన భయాలు
  • సెన్సెక్స్‌ 188, నిఫ్టీ 63 పాయింట్లు పతనం

ముంబై, జనవరి 28:దేశీయ స్టాక్‌ మార్కెట్లకు కరోనా వైరస్‌ పీడిస్తున్నది. పొరుగు దేశం చైనాను వణికిస్తున్న ఈ మహమ్మారి.. భారత్‌లోకీ ప్రవేశించిందన్న భయాలతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 188.26 పాయింట్లు లేదా 0.46 శాతం పతనమై 40,966.86 వద్ద ముగియగా, గత ఆరు వారాలకుపైగా కాలంలో కనిష్ఠానికి చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 63.20 పాయింట్లు లేదా 0.52 శాతం క్షీణించి 12,055.80 వద్ద నిలిచింది. నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, పన్ను వసూళ్ల మందగమనం, కేంద్ర బడ్జెట్‌, ఎన్నికలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులు తాజా ట్రేడింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు. సోమవారం కూడా మార్కెట్లు నష్టాలకే పరిమితమైన విషయం తెలిసిందే. కాగా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ విలువ అత్యధికంగా 4.55 శాతం నష్టపోగా, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మారుతి, ఐటీసీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లూ కుప్పకూలాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల విలువ 1.53 శాతం మేర పెరిగింది. రంగాలవారీగా టెలికం షేర్లు 4.11 శాతం దిగజారగా, మెటల్‌, ఎనర్జీ, పవర్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలూ కోలుకోలేదు. అయినప్పటికీ చమురు, గ్యాస్‌, ఐటీ, ఆర్థిక రంగాల సూచీలు మెరిశాయి. ఇక బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్ల సూచీలు 0.52 శాతం మేర నష్టపోయాయి.

గ్లోబల్‌ మార్కెట్లూ ఢమాల్‌

కరోనా వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లూ నష్టపోయాయి. దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, హాంకాంగ్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. ముఖ్యం గా దక్షిణ కొరియా సూచీ 3 శాతానికిపైగా పడిపోగా, జపాన్‌ సూచీ 0.55 శాతం దిగజారింది. చైనాలో ఈ వైరస్‌ ధాటికి 106 మంది చనిపోగా, దాదాపు 1,300 కొత్త కేసులు నమోదైయ్యాయి. యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లూ ప్రభావితం అవగా, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.


logo