గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 12, 2020 , 00:09:06

నల్లగొండ జిల్లాలో నూతన టర్మినల్‌

నల్లగొండ జిల్లాలో నూతన టర్మినల్‌
  • రూ. 611 కోట్లతో ఏర్పాటు
  • రెండేండ్లలో పారాదీప్‌-హైదరాబాద్‌ పైపులైన్‌ సిద్ధం
  • ఐవోసీ తెలంగాణ, ఏపీ హెడ్‌ ఆర్‌ శ్రావణ్‌ ఎస్‌ రావు

హైదరాబాద్‌, మార్చి 11: రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను మెరుగుపరుచడానికి ఏర్పాటు చేస్తున్న పారాదీప్‌-హైదరాబాద్‌ పైపులైన్‌ ప్రాజెక్టు వచ్చే రెండేండ్లలో పూర్తికానున్నదని ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హెడ్‌ ఆర్‌ శ్రావణ్‌ ఎస్‌ రావు తెలిపారు. రూ.3,800 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో 1,212 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని, పారాదీప్‌-వైజాగ్‌-రాజమండ్రి-విజయవాడల మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు. దీంతోపాటు రూ.611 కోట్లతో నల్గొండ జిల్లాలోని మల్కాపూర్‌ వద్ద 69 ఎకరాల స్థంలో  ఏర్పాటు చేస్తున్న నూతన టర్మినల్‌ వచ్చే 18 నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆయన  ప్రకటించారు. ఈ టర్మినల్‌లో 1.80 లక్షల కిలోలీటర్ల ఇంధనాన్ని నిల్వ ఉంచడానికి వీలుంటుందన్నారు. 


సీఎన్‌జీ కంటే డీజిల్‌ ఉత్తమం

కాలుష్యాన్ని నియంత్రించడంలో సీఎన్‌జీ కంటే బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన డీజిల్‌ బెస్ట్‌ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని పెట్రోల్‌ బంకు ల్లో బీఎస్‌-6 ఇంధనాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించిన ఆయ న..పాతదాంతో పోలిస్తే ధర కాస్త ఎక్కువగా ఉంటుందన్నారు. 


రాష్ట్రంలో మరో 1,450 పెట్రోల్‌ బంకులు

తెలంగాణలో మరో 1,450కి పైగా పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదివరకే ఉన్న 1,100 బంకుల్లో సగం వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసినట్లు, అలాగే నూతనంగా నెలకొల్పేవాటిని కూడా గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేయనున్నట్లు రావు చెప్పారు. వీటితోపాటు హైదరాబాద్‌లో తొమ్మిది పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పినట్లు, వచ్చే ఆరు నెలల్లో ఈ సంఖ్యను 50కి పెంచుకోనున్నట్లు తెలిపారు.


logo
>>>>>>