శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 17, 2021 , 22:11:34

ఆదాతో క‌ష్టాల‌కు చెక్‌: బీ అల‌ర్ట్..

ఆదాతో క‌ష్టాల‌కు చెక్‌: బీ అల‌ర్ట్..

న్యూఢిల్లీ: మాన‌వాళిని వ‌ణికించిన కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వివిధ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను, వ్యాపారాల‌ను పూర్తిగా ధ్వంసం చేసేసింది. వివిధ సంస్థ‌లు చేప‌ట్టిన పొదుపు చ‌ర్య‌ల ఫ‌లితంగా ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దాని ప్ర‌భావం వారి కుటుంబాల జీవ‌నంపై తీవ్ర ప్ర‌బావం చూపింది. ఇంటి ఆదాయం త‌గ్గిపోయింది. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వంశీ దూరదృష్టితోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగాడంటే అతిశ‌యోక్తి కాదు. ఉద్యోగం పోవ‌డంతో వంశీ, ఆయ‌న భార్య‌, ఐదేండ్ల కూతురును సాక‌డం అంత తేలికేం కాదు. 

మ‌రి కొన్నేండ్ల‌పాటు వంశీ ఆచితూచి ముందుకెళ్లాల్సిన ప‌రిస్థితి. వంశీదే కాదు ప్ర‌తి ఒక్క‌రూ ఆచితూచి ఖ‌ర్చులు చేయాల్సిన దుస్థితి నెల‌కొంది. ఇటువంటి స‌మ‌యంలో మ‌ధ్య‌కాలిక వ్యూహంతో కొన్ని పొదుపు చ‌ర్య‌లు తీసుకోగ‌లిగితే కుటుంబాల జీవ‌నం సాఫీగా సాగిపోతుంది. ఈ దిశ‌గా తొలుత ఇంటి బ‌డ్జెట్‌ను తిరిగి రూపొందించుకోవాలి. అలాగ‌ని ప్ర‌తి పైసా ఖ‌ర్చు త‌గ్గించ‌డమ‌ని అర్థం కాదు. కానీ చాలా సంప్ర‌దాయ జీవ‌న విధానం అవ‌లంభిస్తే.. విచ‌క్ష‌ణ‌తో కూడిన ఖ‌ర్చులు పెడితే చాలా ఉప‌యోగంగా ఉంటుంద‌ని ఆర్థిక‌వేత్త‌లు అంటున్నారు. న‌గ‌దు ల‌భ్య‌త‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకుంటూ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల దిశ‌గా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 

ఈ నేప‌థ్యంలో పొదుపు పెంచ‌డంపైనే దృష్టిని కేంద్రీక‌రించాల్సి ఉంటుంది. క‌నీసం ప‌ది శాతం త‌మ ఆదాయంలో పొదుపుకు మ‌ళ్లించ‌గ‌లిగితే ఉప‌యుక్తంగా ఉంటుంది. స్వ‌ల్ప‌కాలిక న‌గ‌దు ల‌భ్య‌త ఆధారంగా ప్రణాళిక‌లు రూపొందించుకోవాలి. అత్య‌వ‌స‌ర‌మైతే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్ల‌ను తీసేసి ఖ‌ర్చుకు ఉప‌యోగించుకోవాలి. ఆస్తుల విక్ర‌యం విష‌యంలో ఆద‌రాబాద‌రా నిర్ణ‌యాలు అస‌లే వ‌ద్దని ఆర్థిక‌వేత్త‌లు సూచిస్తున్నారు. ఉద్యోగం లేకుండా పోయిన‌ప్పుడు బ్యాంకుల్లో తీసుకున్న వివిధ రుణాల వాయిదాల చెల్లింపు స‌మ‌స్య వెన్వెంట‌నే తోసుకువ‌స్తుంది. ఈ ప‌రిస్థితుల్లో వంశీ వంటి వారు సంబంధిత బ్యాంకుల‌కు వెళ్లి కొన్ని నెల‌ల పాటు.. ఈఎంఐ హాలీడే ఆప్ష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని అభ్య‌ర్థించారు. అత్య‌వ‌స‌రం పేరిట క్రెడిట్ కార్డుల వాడ‌కం జోలికే వెళ్లొద్ద‌ని ఆర్థిక‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. 

బాధ్య‌తారాహిత్యంగా క్రెడిట్ కార్డుల‌ను వాడ‌టం వ‌ల్ల స‌ద‌రు వ్య‌క్తుల ఆర్థిక వ‌నరులు పూర్తిగా గంద‌ర‌గోళంలో ప‌డ‌తాయి. ఈ ప‌రిస్థితుల్లో క్రెడిట్ కార్డుల రుణ వాయిదాల చెల్లింపున‌కు మూడు నెల‌ల పాటు ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవ‌డం ఉప‌యుక్తంగా ఉంటుంద‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వంశీ వంటి వారు త‌ప్ప‌నిస‌రిగా దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల దిశ‌గా పొదుపు, ఆదాయం ప్ర‌ణాళిక‌లు త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయ‌డం అల‌వాటుగా మార్చుకోవాలి. కొవిడ్ క‌ష్ట‌కాలంలో ట‌ర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవ‌డం కూడా అస‌లు మ‌రిచిపోవ‌ద్దు. ప్ర‌స్తుత ఆదాయం స్థాయికి అనుగుణంగా దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకు సాగితేనే మేల్కోగ‌లం..

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo