సోమవారం 30 మార్చి 2020
Business - Mar 04, 2020 , 00:02:12

కొత్త ఐటీ విధానం దండగే

కొత్త ఐటీ విధానం దండగే
  • ఉద్యోగులకు లాభించదు
  • 81 శాతం సంస్థల అభిప్రాయం

ముంబై, మార్చి 3: కొత్త ఐటీ విధానంతో ఉద్యోగులకు లాభమేమీ ఉండదని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. తమ ఉద్యోగులకు ఈ విధానం లాభిస్తుందని తాము విశ్వసించడం లేదని 81 శాతం సంస్థలు అంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను గత నెల 1న పార్లమెంట్‌లో ప్రకటించిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త ఆదాయం పన్ను (ఐటీ) విధానాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న విధానంతోపాటు కొత్త విధానం కూడా అమల్లో ఉంటుందని, నచ్చినదాన్ని ఎంచుకోవచ్చని మంత్రి స్పష్టం చేసిన సంగతీ విదితమే. ఈ క్రమంలో హెచ్‌ఆర్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెర్సర్‌ ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. వివిధ రంగాల్లోని 119 సంస్థల నుంచి హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ ప్రొఫెషనల్స్‌ అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 81 శాతం మంది తమ ఉద్యోగులకు కొత్త ఐటీ విధానంతో ప్రయోజనాలుండవని అన్నారు. రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ను ప్రభావితం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఐటీ/ఐటీ అనుబంధ, హెల్త్‌కేర్‌, కెమికల్‌/లైఫ్‌ సైన్సెస్‌, కన్సల్టింగ్‌, టెలికం, ఎఫ్‌ఎంసీజీ/రిటైల్‌, ట్రావెల్‌/లాజిస్టిక్స్‌, విద్యా రంగాల్లో ఈ సర్వేను నిర్వహించారు.


logo