అదరగొట్టిన అరబిందో

- క్యూ3లో నాలుగింతలైన నికర లాభం
హైదరాబాద్, ఫిబ్రవరి 10: అరబిందో ఫార్మా ఆర్థిక ఫలితాలు అదుర్స్ అనిపించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి సంస్థ రూ.2,946.32 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.705.31 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. ఆయాచితంగా అధికంగా నిధులు సమకూరడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.5,895 కోట్ల నుంచి రూ.6,364.91 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. సబ్సిడరీ సంస్థ నాట్రోల్ ఎల్ఎల్సీ, యుగియా ఫార్మాలో వాటాలను విక్రయించడంతో రూ.2,813.89 కోట్ల నిధులు సమకూరడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.5 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించిన మూడో మధ్యంతర డివిడెండ్ ఇదే కావడం గమనార్హం.