బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 26, 2020 , 00:07:45

విస్తరణ దిశగా బీజీఎల్‌!

విస్తరణ దిశగా బీజీఎల్‌!
  • రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు సీఎన్‌జీ పైప్‌లైన్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సంప్రదాయ ఇంధన వనరుల వైపు వాహనదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో కంప్రెస్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) బంకుల విస్తరణ జరుగుతున్నది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన నగరాలకూ పైపులైను ద్వారా సీఎన్‌జీ సరఫరా చేయాలని భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీజీఎల్‌) భావిస్తున్నది. ఇప్పటివరకు కాకినాడ నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్‌లోని శామీర్‌పేట, కొంపల్లి, జీడిమెట్ల ప్రాంతాలకు పైపులైను ద్వారా సీఎన్‌జీ సరఫరా అవుతున్నది. అయితే డిమాండ్‌ పెరుగుతుండటంతో విస్తరణ బాటపట్టిన బీజీఎల్‌.. వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌, షాద్‌నగర్‌ ప్రాంతాలకూ సేవలను అందించాలని నిర్ణయించింది. ముందుగా కరీంనగర్‌ పట్టణంలో సీఎన్‌జీ అందుబాటులోకి తేవాలని చూస్తున్నది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారైన తర్వాత పనులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. అంతా సజావుగా జరిగితే సంవత్సరంలోగా అందుబాటులోకి రావచ్చని సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌తో పోల్చితే తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇవ్వడంతోపాటు, కాలుష్య కారకాలు పరిమితంగా విడుదలై పర్యావరణ పరిరక్షణకూ సీఎన్‌జీ ఎంతో దోహదం చేస్తున్నది. 


దీంతో సీఎన్‌జీ ఆధారిత వాహనాల వినియోగం క్రమేణా పెరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం కూడా కలిసొస్తున్నది. కాగా, కరీంనగర్‌ మార్గంలో సిద్దిపేట, వంటిమామిడి తదితర ప్రాంతాల్లో ఇటీవలే సీఎన్‌జీ బంకులను ఏర్పాటు చేశారు. మరో మూడు బంకులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలున్నాయి. ఇక వరంగల్‌ మార్గంలో రెండు బంకులను ఏర్పాటు చేశారు. అయితే ముందుగా కరీంనగర్‌కు పైపులైను ద్వారా సీఎన్‌జీని తరలించి అక్కడి నుండి సమీప ప్రాంతాలకు వాహనాల ద్వారా సరఫరా చేయాలన్న ప్రతిపాదనలున్నాయి. రోజూ లక్ష కిలోలకుపైగా సీఎన్‌జీ అమ్ముడవుతున్నదంటే దీని డిమాండ్‌ అంచనా వేయవచ్చు. 2015 లో 50 వేల కిలోలు ఉన్న సీఎన్‌జీ విక్రయం.. ప్రస్తుతం రెట్టింపైందని సదరు సీనియర్‌ అధికారి చెప్పారు. 2003లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన బీజీఎల్‌.. క్రమేపీ బంకుల సంఖ్యను పెంచుతూ ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లోనే 48 సీఎన్‌జీ బంకులను ఏర్పాటు చేసింది. మరిన్ని బంకులకు నోటిఫికేషన్‌ జారీచేసింది. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సీఎన్‌జీ బంకులు దర్శనమిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.


logo