శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 26, 2021 , 01:45:58

లక్ష కోట్లతో జాతీయ బ్యాంక్‌!

లక్ష కోట్లతో జాతీయ బ్యాంక్‌!

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో ప్రకటించనున్న కేంద్రం

న్యూఢిల్లీ, జనవరి 25: మౌలిక వసతులకు సంబంధించిన భారీ ప్రాజెక్టులకు సులభంగా పెట్టుబడులు అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌-2021లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వం ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వివిధ వర్గాలు ధ్రువీకరించాయి. రూ.లక్ష కోట్ల మూలధనంతో నేషనల్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నదని, దీనికి తొలుత రూ.20 వేల కోట్ల పెయిడప్‌ క్యాపిటల్‌ను సమకూర్చవచ్చని ఆ వర్గాలు వివరించాయి. ప్రావిడెంట్‌, పెన్షన్‌, ఇన్సూరెన్స్‌ ఫండ్‌ సంస్థలు తమ నిధుల్లో కొన్నింటిని తప్పనిసరిగా నేషనల్‌ బ్యాంక్‌లో ఉంచేలా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.

ముడి పదార్థాలపై తగ్గనున్న సుంకాలు?

దేశీయ తయారీ, ఎగుమతుల రంగాలను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు నిర్దిష్ఠ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. దీనిలో భాగంగా ఫర్నిచర్‌ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రాగి తుక్కు, కొన్ని రకాల రసాయనాలు, టెలికం పరికరాలు, రబ్బర్‌ ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలను కుదించే అవకాశం కనిపిస్తున్నది. సానబెట్టిన వజ్రాలు, రబ్బర్‌ వస్తువులు, లెదర్‌ దుస్తులు, టెలికం పరికరాలు, తివాచీల్లాంటి దాదాపు 20 రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని, ఫర్నిచర్‌ తయారీకి ఉపయోగించే రఫ్‌ కలప, స్వాన్‌ ఉడ్‌, హార్డ్‌ బోర్డ్‌ లాంటి కొన్ని రకాల ముడి పదార్థాలపై కస్టమ్స్‌ సుంకాలను తొలగించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ‘ఖరీదైన ముడి పదార్థాలు అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పోటీతత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మన దేశ ఫర్నిచర్‌ ఎగుమతులు చాలా తక్కువగా (దాదాపు ఒక శాతంగా) ఉన్నాయి. ఈ ఎగుమతుల్లో చైనా, వియత్నాం లాంటి దేశాలు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫర్నిచర్‌ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలతోపాటు మరికొన్ని రకాల ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గించడంపై ప్రభుత్వం పరిశీలించే అవకాశం కనిపిస్తున్నది’ అని ఆ వర్గాలు వివరించాయి. ఇదే సమయంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, క్లాత్‌ డ్రయర్ల లాంటి కొన్ని రకాల ఫినిష్ట్‌ వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచవచ్చని ఓ అధికారి తెలిపారు. దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఎయిర్‌ కండీషనర్లు, ఎల్‌ఈడీ లైట్ల తయారీ లాంటి పలు పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

VIDEOS

logo