శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 29, 2020 , 03:28:32

27 వేల కోట్ల ఒప్పందం!

27 వేల కోట్ల ఒప్పందం!

  • బిగ్‌బజార్‌ను కొనుగోలు చేయనున్న రిలయన్స్‌

బెంగళూరు, జూలై 28: దేశీయ రిటైల్‌ రంగం మరో భారీ ఒప్పందానికి వేదికకాబోతున్నది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్‌ గ్రూపు అధినేత కిశోర్‌ బియానీకి చెందిన రిటైల్‌ వ్యాపారాన్ని సైతం ముకేశ్‌ అంబానీ కొనుగోలు చేయబోతున్నాడు. ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఒప్పందం విలువ 24 వేల కోట్ల నుంచి రూ.27 వేల కోట్ల వరకు(3.2-3.6 బిలియన్‌ డాలర్ల) ఉంటుందని అంచనా. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ మింట్‌ ఒక కథనాన్ని పేర్కొంది. బిగ్‌బజార్‌, ఫుడ్‌ధాల్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ పేర్లతో ఫ్యూచర్‌ గ్రూపు రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. అలాగే ఇప్పటికే రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు 12 వేల స్టోర్లు ఉన్నాయి. రిటైల్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ముకేశ్‌ అంబానీ ఫ్యూచర్‌ గ్రూపుపై కన్ను పడింది. టెలికం విభాగం జియోలోకి పెట్టుబడులు వరదలా రావడంతో ఈ నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 

కరోనాతో కకావికలం

కరోనా వైరస్‌తో దేశీయ రిటైల్‌ రంగం కకావికలమైంది. అప్పటికే అంతంత మాత్రంగా నడుస్తున్న ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన రిటైల్‌ సంస్థలపై కరోనా పిడుగుతో మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు కావడంతో గతేడాది సెప్టెంబర్‌లో సంస్థ రూ.12,770 కోట్ల నిధులను సేకరించారు. మరోవైపు ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన ఐదు సంస్థలు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. వీటిలో ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లు ఉన్నాయి.


logo