బుధవారం 03 జూన్ 2020
Business - Apr 10, 2020 , 00:08:06

మళ్లీ ముకేశే

మళ్లీ ముకేశే

  • ఫోర్బ్స్‌ సంపన్న భారతీయులలో అగ్రస్థానం
  • సంపద విలువ 36.8 బిలియన్‌ డాలర్లు
  • ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న జెఫ్‌ బెజోస్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ కుబేరుల సంపదపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఫోర్బ్స్‌ తాజా జాబితాలో భారతీయ శ్రీమంతుడు ముకేశ్‌ అంబానీ 36.8 బిలియన్‌ డాలర్లతో 21వ స్థానంలో ఉన్నారు. గతంతో పోల్చితే ముకేశ్‌ సంపద తరిగిపోవడం గమనార్హం. దీంతో ర్యాంక్‌ కూడా పడిపోయింది. అయినప్పటికీ దేశీయ ధనవంతుల్లో ముకేశ్‌దే అగ్రస్థానం. కాగా, రిటైల్‌ దిగ్గజం డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ ఆయన కుటుంబం సంపద విలువ 13.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. జాబితాలో 78వ స్థానంలో ఉన్నారు. టాప్‌-100లో భారత్‌ తరఫున ముకేశ్‌, దమానీలకు మాత్రమే చోటు దక్కడం గమనార్హం. టాప్‌-200లో మాత్రం 10 మంది ఉన్నారు. ఇక ఎప్పట్లాగే ప్రపంచ సంపన్నుడిగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ఈయన సంపద విలువ 113 బిలియన్‌ డాలర్లు. రెండో స్థానంలో 98 బిలియన్‌ డాలర్లతో బిల్‌గేట్స్‌ ఉన్నారు. వారెన్‌ బఫెట్‌ (67.5 బిలియన్‌ డాలర్లు), మార్క్‌ జూకర్‌బర్గ్‌ (54.7 బిలియన్‌ డాలర్లు)లు వరుసగా 4, 7 స్థానాల్లో నిలిచారు. మొత్తం 2,095 మందితో ఈ జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఇందులో 100 మందికిపైగా భారతీయులుండగా, వారిలో నలుగురు మహిళలున్నారు.

నలుగురు తెలుగువాళ్లు

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో నలుగురు తెలుగువాళ్లకి చోటు దక్కింది. 3.5 బిలియన్‌ డాలర్ల సంపదతో దివీస్‌ లాబోరేటరీస్‌ అధినేత మురళీ దివీ, ఆయన కుటుంబం ముందు వరుసలో ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో పిచ్చి రెడ్డి (1.6 బిలియన్‌ డాలర్లు), పీవీ కృష్ణా రెడ్డి (1.6 బిలియన్‌ డాలర్లు), అరబిందో ఫార్మా అధిపతి పీవీ రాంప్రసాద్‌ రెడ్డి (1.4 బిలియన్‌ డాలర్లు) ఉన్నారు. వీరిలో ఇద్దరు ఔషధ రంగానికి చెందినవారవగా, మరో ఇద్దరు మౌలిక రంగంలో ఉన్నారు. పీపీ రెడ్డీ, పీవీ కృష్ణా రెడ్డీలు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సారథులు.


logo