శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 26, 2020 , 00:26:48

ముకేశ్‌ ఔట్‌

ముకేశ్‌ ఔట్‌

  • టాప్‌-10 ప్రపంచ కుబేరుల్లో బెర్త్‌ దూరం
  • బ్లూంబర్గ్‌ ర్యాంకుల్లో 11వ స్థానం
  • మార్కెట్‌ ఒడిదుడుకులతో లక్ష కోట్ల సంపద ఆవిరి
  • 16 శాతం పడిపోయిన రిలయన్స్‌ షేర్ల విలువ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఒడిదుడుకులు.. ముకేశ్‌ అంబానీ సంపదను ఆవిరి చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు భీకర ఎత్తుపల్లాలను చవిచూస్తుండగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లకూ నష్టాలు తప్పడం లేదు. ఫలితంగా టాప్‌-10 ప్రపంచ కుబేరుల జాబితా నుంచి మన శ్రీమంతుడు బయటకు రావాల్సి వచ్చింది. నిజానికి విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను అందుకుంటూ ఈ ఏడాది ముకేశ్‌ మార్కెట్‌ లీడర్‌గా నిలిచారు. ఓవైపు ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్నా, లాక్‌డౌన్లతో అలజడి నెలకొన్నా.. మరోవైపు ఫేస్‌బుక్‌ తదితర ఎన్నో దిగ్గజ సంస్థలు రిలయన్స్‌ గ్రూప్‌ సంస్థల్లో వాటాలను కొన్నాయి. అయినప్పటికీ కొవిడ్‌-19 ప్రభావం ముందు ముకేశ్‌, రిలయన్స్‌ సామ్రాజ్యం తలొంచాయి. బ్లూంబర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ టాప్‌-10లో ముకేశ్‌ స్థానం ముణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో సుమారు 90 బిలియన్‌ డాలర్ల (రూ.6.62 లక్షల కోట్లు)తో 4వ స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ.. ఇప్పుడు 11వ స్థానానికి పడిపోయారు. సంపద విలువ 76.5 బిలియన్‌ డాలర్ల (రూ.5.63 లక్షల కోట్లు)కు దిగజారింది. అంటే లక్ష కోట్ల రూపాయల సంపద ఆవిరైందన్నమాట. 

రూ.3 లక్షల కోట్లు పైకి

ఆర్‌ఐఎల్‌ షేర్‌ విలువ ఇటీవలికాలంలో బాగా పడిపోయినా.. ఈ ఏడాదే భారీగా పెరిగింది. మదుపరుల కొనుగోళ్ల జోరుతో 33 శాతం ఎగబాకగా.. మార్కెట్‌ విలువ రూ.3 లక్షల కోట్లకుపైగానే ఎగిసింది. గడిచిన 25 ఏండ్లలో సంస్థ సాధించిన మార్కెట్‌ విలువలో ఈ మొత్తం సగానికి సమానం కావడం గమనార్హం. మార్చి 1995-మార్చి 2020 మధ్య ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.6.3 లక్షల కోట్లకు పెరిగింది. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా మరో రూ.3 లక్షల కోట్లకుపైగా ఎగిసింది. ప్రస్తుతం సంస్థ మార్కెట్‌ విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లుగా ఉన్నది.

అమెజాన్‌ దెబ్బ

ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌, హోల్‌సేల్‌ ఆస్తుల కొనుగోలు ఒప్పందంతో ఆర్‌ఐఎల్‌ షేర్‌ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.2,369.35ను తాకింది. అయితే అమెజాన్‌ జోక్యంతో ఈ డీల్‌ రిస్కులో పడగా, ఆర్‌ఐఎల్‌ షేర్‌ విలువ గడిచిన రెండు నెలల్లోనే భారీగా నష్టపోయింది. ప్రస్తుతం ఒక్కో షేర్‌ విలువ రూ.1,994.15 వద్ద ఉన్నది. దీంతో దాదాపు 16 శాతం క్షీణించినైట్లెంది. ఈ ప్రభావం ముకేశ్‌ సంపదపైనా పడింది. ఈ క్రమంలోనే బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ర్యాంక్‌ తగ్గిపోయింది.


VIDEOS

logo