శనివారం 06 జూన్ 2020
Business - Apr 06, 2020 , 23:36:52

రోజుకు 2,200 కోట్ల నష్టం

రోజుకు 2,200 కోట్ల నష్టం

  • రెండు నెలల్లో రూ. 1.44 లక్షల కోట్లు కోల్పోయిన ముకేశ్‌ అంబానీ 

ముంబై, ఏప్రిల్‌ 6: స్టాక్‌ మార్కెట్ల పతనం దేశీయ కుబేరుల సంపాదనకు ఎసరుపెట్టింది. కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో పాతాళంలోకి పడిపోయిన ఈక్విటీ మార్కెట్లతో సంపన్న వర్గాల సంపద కూడా హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. గడిచిన రెండు నెలల్లోనే దేశీయ కుబేరుడైన ముకేశ్‌ అంబానీ ఏకంగా 19 బిలియన్‌ డాలర్ల సంపాదనను కోల్పోయారు. మన కరెన్సీలో ఇది రూ.1.44 లక్షల కోట్లకు సమానం. అంటే రోజుకు రూ.2,200 కోట్లకు పైగా నష్టపోయినట్లు హ్యురున్‌ గ్లోబల్‌ రిచ్‌ తాజాగా వెల్లడించింది. ఆయన మొత్తం సంపాదనలో ఈ వాటా 28 శాతానికి సమానం. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం 7 నుంచి 17కి పడిపోయింది. మిగతా దేశీయ సంపాన్న వర్గాల్లో గౌతమ్‌ అదానీ(6 బిలియన్‌ డాలర్లు), హెచ్‌సీఎల్‌ టెక్‌ అధినేత శివ్‌ నాడర్‌(5 బిలియన్‌ డాలర్లు), ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కొటక్‌(4 బిలియన్‌ డాలర్లు) కోల్పోయారు. అంబానీ మినహా మిగతా ముగ్గురు టాప్‌-100 జాబితా నుంచి వైదొలిగినట్లు తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కరోనా వైరస్‌ దెబ్బకు గత రెండు నెలల్లో దేశీయ మార్కెట్లు 25 శాతం మేర నష్టపోయాయి.


logo