గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Dec 29, 2020 , 00:13:01

మరిన్ని మొండి బాకీలు

మరిన్ని మొండి బాకీలు

మార్చి నాటికి స్థూల నిరర్థక ఆస్తులు 10.6 శాతానికి

తాజా నివేదికలో ఐసీఆర్‌ఏ అంచనా

ముంబై: దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ), నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) వచ్చే ఏడాది మార్చినాటికి మరింత పెరగవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ సోమవారం తెలిపింది. జీఎన్‌పీఏలు 10.1-10.6 శాతానికి ఎగబాకవచ్చని, ఎన్‌ఎన్‌పీఏలు 3.1-3.2 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. అయితే మార్చి 2022కల్లా ఎన్‌ఎన్‌పీఏలు 2.4-2.6 శాతానికి దిగిరావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘రుణ చెల్లింపులపై మారటోరియం ముగిసింది. అయినప్పటికీ ఆస్తుల వర్గీకరణపై సుప్రీం కోర్టు ఆదేశం కోసం చూస్తున్నాం. అయితే వచ్చే ఏడాది మార్చికల్లా జీఎన్‌పీఏలు 10.1-10.6 శాతానికి, ఎన్‌ఎన్‌పీఏలు 3.1-3.2 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ ఆఖరు నాటికి జీఎన్‌పీఏలు 7.9 శాతంగా, ఎన్‌ఎన్‌పీఏలు 2.2 శాతంగా ఉన్నాయి’ అని తమ నివేదికలో ఐసీఆర్‌ఏ చెప్పింది.

రుణ పునర్వ్యవస్థీకరణలు తక్కువే

కరోనా వైరస్‌ నేపథ్యంలో రుణాల పునర్వ్యవస్థీకరణలు అధికంగా ఉంటాయని గతంలో అంచనా వేసినట్లు ఐసీఆర్‌ఏ తెలిపింది. అయితే తమ అంచనాలను తలకిందులు చేస్తూ ఇవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పింది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాలను మించి త్వరగా కోలుకోవడం, వివిధ రంగాలకు ప్రభుత్వ సాయం అందడం వంటివి రుణ చెల్లింపులపై కరోనా పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించాయన్నది. బ్యాంకులు సైతం రుణాల్లో 90 శాతానికిపైగా వసూళ్లను చూస్తున్నాయన్న ఐసీఆర్‌ఏ.. గతంలో వేసిన రుణ పునర్వ్యవస్థీకరణ అంచనాను 5-8 శాతం నుంచి 2.5-4.5 శాతానికి తగ్గించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నికర ఎన్‌పీఏలకు బ్యాంకుల ఆదాయాల్లో పెద్దగా కేటాయింపులు ఉండకపోవచ్చన్నది. తద్వారా బ్యాంకర్లు అధిక లాభాలను ప్రకటించే వీలుందన్నది. ఈ క్రమంలోనే ఎన్‌ఎన్‌పీఏలు మార్చి 2022 నాటికి 2.4-2.6 శాతానికి తగ్గే వీలుందని ఐసీఆర్‌ఏ ఆర్థిక రంగ రేటింగుల అధిపతి అనిల్‌ గుప్తా చెప్పారు.

మూలధనం పెరగాలి

బ్యాంకుల మూలధనం పెరిగితే లాభాలకు అవకాశాలూ మెరుగవుతాయని ఐసీఆర్‌ఏ అభిప్రాయపడింది. భారీ ప్రైవేట్‌ రంగ బ్యాంకుల మూలధన నిల్వలు బలంగా ఉన్నాయని, అందుకే ఎటువంటి ఆటుపోట్లనైనా అవి తట్టుకోగలుగుతున్నాయని ఐసీఆర్‌ఏ ఆర్థిక రంగ రేటింగుల అధిపతి అనిల్‌ గుప్తా గుర్తుచేశారు. వచ్చే ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.43వేల కోట్ల వరకు అదనపు మూలధనం అవసరమవుతుందన్నారు. తక్కువ వడ్డీరేట్లు, మెరుగైన వ్యాపార పరిస్థితులు, ఆదాయం, ఉద్యోగావకాశాలు వచ్చే ఏడాది రుణాలకు డిమాండ్‌ను పెంచవచ్చని గుప్తా చెప్పారు.


VIDEOS

logo