ఆదివారం 31 మే 2020
Business - Apr 18, 2020 , 03:24:57

రాష్ర్టాలకు మరిన్ని స్వల్ప రుణాలు

రాష్ర్టాలకు మరిన్ని స్వల్ప రుణాలు

వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏ) కింద రాష్ర్టాలకు కల్పించే ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని 60 శాతానికి పెంచుతున్నట్టు రిజర్వు బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. రాబడులు, చెల్లింపుల మధ్య తాత్కాలిక తేడాలు ఎదురైనప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొంటాయి. ఇలా తీసుకొనే స్వల్పకాలిక రుణాలనే వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అడ్వాన్సులను పొందేందుకు రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్‌ 17(5) వీలు కల్పిస్తుంది. ఇది రుణవనరు కాదు. తాత్కాలిక ఓవర్‌డ్రాఫ్ట్‌ మాత్రమే. ఇలాంటి అడ్వాన్సుల గరిష్ఠ కాలపరిమితి కేంద్ర ప్రభుత్వానికి 10 రోజులు, రాష్ట్ర ప్రభుత్వాలకు 14 రోజులు ఉంటుంది. ఈ అడ్వాన్సులపై రిజర్వు బ్యాంకు రెపోరేటుతో సమానంగా వడ్డీ వసూలు చేస్తుంది. ఆర్బీఐ నిర్ణయించిన పరిమితికి లోబడి ఈ అడ్వాన్సులు తీసుకొనేందుకు వీలుంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆర్బీఐ ప్రభుత్వంతో సంప్రదించి ఈ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిమితి రూ.1.20 లక్షల కోట్లుగా ఉన్నది. గతేడాది ఇది రూ.75 వేల కోట్లుగా ఉన్నది.


logo