బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 18, 2020 , 00:45:23

వృద్ధి 5.3 శాతమే: మూడీస్‌

వృద్ధి 5.3 శాతమే: మూడీస్‌

న్యూఢిల్లీ, మార్చి 17: అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ మరోమార్‌ భారత వృద్ధి అంచనాను తగ్గించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఏడాది భారత వృద్ధి 5.3 శాతానికి పరిమితంకానున్నట్లు మంగళవారం తాజాగా వెల్లడించింది. గత నెలలో విడుదల చేసిన ముందస్తు అంచనాలో వృద్ధి 5.4 శాతంగా ఉండనున్నదని పేర్కొంది. మళ్లీ నెల రోజులు గడువకముందే అంచనాల్లో మరోసారి కోత విధించింది. గతంలో 6.6 శాతంగా ఉంటుందని అంచనాను విడుదల చేసిన మూడీస్‌..గడిచిన రెండు నెలల నుంచి వరుసగా తగ్గిస్తూ వస్తున్నది. 2018లో 7.4 శాతంగా నమోదైన వృద్ధి..2019లో 5.3 శాతంగా అంచనావేయగా, 2020లోనూ అంతేస్థాయిలో ఉండనున్నదని పేర్కొంది. చైనాను గడగడలాడించిన కరోనా వైరస్‌ ప్రస్తుతం భారత్‌లో వేగంగా విస్తరిస్తుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదన్న రేటింగ్‌ ఏజెన్సీ.. ముఖ్యంగా దేశీయ వినిమయ డిమాండ్‌ భారీగా పడిపోతున్నదని, మరోవైపు సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. కానీ, 2021లో మాత్రం భారత్‌ తిరిగి కోలుకొని 5.8 శాతం వృద్ధిని సాధించనున్నదని పేర్కొనడం విశేషం. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి పలు ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీలు, కీలక చర్యలు తీసుకుంటున్నాయని, ముఖ్యం గా వడ్డీరేట్లను సైతం తగ్గిస్తున్నాయని మూడీస్‌ వర్గాలు వెల్లడించాయి.  


logo