గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 25, 2020 , 00:50:18

పన్ను వసూళ్లు

పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) కార్పొరేట్‌, ఆదాయ పన్ను వసూళ్లు భారీగా తగ్గనున్నాయి. గత రెండు దశాబ్దాల్లో తొలిసారి అంతకుముందు ఏడాదితో పోల్చితే ప్రస్తుత ఏడాది తక్కువగా నమోదయ్యేలా కనిపిస్తున్నాయి. దేశ వృద్ధిరేటు (జీడీపీ) గణనీయంగా పడిపోవడం, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించడం ఇందుకు ప్రధాన కారణమని పలువురు సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు.

  • వార్షిక లక్ష్యంలో సగానికే పరిమితం..
  • ఈ నెల 23నాటికి వసూలైంది రూ.7.3 లక్షల కోట్లే
  • కేంద్ర ప్రభుత్వ అంచనా రూ.13.5 లక్షల కోట్లు..
  • రెండు దశాబ్దాల్లో తొలిసారి

ముంబై, జనవరి 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) కార్పొరేట్‌, ఆదాయ పన్ను వసూళ్లు భారీగా తగ్గనున్నాయి. గత రెండు దశాబ్దాల్లో తొలిసారి అంతకుముందు ఏడాదితో పోల్చితే ప్రస్తుత ఏడాది తక్కువగా నమోదయ్యేలా కనిపిస్తున్నాయి. దేశ వృద్ధిరేటు (జీడీపీ) గణనీయంగా పడిపోవడం, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించడం ఇందుకు ప్రధాన కారణమని పలువురు సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.13.5 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన వసూళ్ల కంటే ఇది 17 శాతం ఎక్కువ. అయితే ఈ నెల 23 నాటికి పన్నుల విభాగం రూ.7.3 లక్షల కోట్లు మాత్రమే వసూలు చేయగలిగిందని, ఇది గతేడాది ఇదే కాలం నాటికి జరిగిన వసూళ్ల కంటే 5.5 శాతం ఎక్కువని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో డిమాండ్‌ గణనీయంగా తగ్గి వ్యాపార రంగం కుదేలవడంతో పలు కంపెనీలు తమ పెట్టుబడులు, ఉద్యోగాల్లో కోత విధించాయి. దీంతో పన్ను వసూళ్లు క్షీణించాయి. ఈసారి దేశ జీడీపీని 11 ఏండ్ల కనిష్ఠ స్థాయిలో 5 శాతంగానే కేంద్రం అంచనా వేస్తుండటం కూడా పన్ను వసూళ్ల మందగమనాన్ని ప్రతిబింబిస్తున్నది. 


నిరుడు కంటే 10 శాతం తగ్గొచ్చు

తొలి మూడు త్రైమాసికాల్లో కంపెనీల నుంచి అడ్వాన్స్‌ పన్నులను వసూలు చేసిన తర్వాత అధికారులు చివరి మూడు నెలల్లో ఎంతగా ప్రయత్నించినప్పటికీ మిగతా వార్షిక ప్రత్యక్ష పన్నుల్లో 30-35 శాతానికి మించి చేయలేకపోతున్నట్టు గత మూడేండ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లకు ఈ ఏడాది కూడా తాము ఎంత గట్టిగా కృషిచేసినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.11.5 లక్షల కోట్ల కంటే దాదాపు 10 శాతం తక్కువగా ఉంటాయని ఎనిమిది మంది సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రభుత్వానికి వచ్చే వార్షిక ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల వాటా దాదాపు 80 శాతం మేరకు ఉంటుంది. ఈ పన్ను వసూళ్లు తగ్గితే ఖర్చులను అధిగమించేందుకు ప్రభుత్వం భారీగా రుణాలను స్వీకరించాల్సి వస్తుంది.


20% జీతం కోత

ఉద్యోగులు ఆధార్‌, పాన్‌ వివరాలను సంస్థలకు చెప్పాల్సిందే

లేనిపక్షంలో ఆదాయం పన్ను వాతే: సీబీడీటీ

ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థలకు తమ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌), ఆధార్‌ వివరాలను చెప్పకపోతే జీతంలో 20 శాతం కోల్పోవాల్సి వస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) హెచ్చరించింది. ఈ మొత్తాన్ని ఆదాయం పన్ను (ఐటీ)గా చెల్లించాల్సి ఉంటుందని ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. ఈ నెల 16 నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన సీబీడీటీ.. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు దాటిన ఉద్యోగులకే ఈ నిబంధన వర్తిస్తుందని ప్రకటించింది. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్‌ 206ఏ కింద ఉద్యోగులు తమ సంస్థలకు వారివారి ఆధార్‌, పాన్‌ కార్డుల వివరాలను అందజేయాల్సిందేనని సదరు సర్క్యులర్‌లో వివరించింది. తప్పుడు వివరాలు సమర్పించినా అధిక శాతంలో పన్నుల కోత పడుతుందని తేల్చిచెప్పింది. కాగా, అధిక మొత్తాల్లో పన్ను కోతల బారినపడిన ఉద్యోగులు 4 శాతం ఆరోగ్య, విద్యా సెస్సు నుంచి మినహాయింపు పొందవచ్చని సీబీడీటీ ఈ సందర్భంగా తెలియజేసింది. 


logo
>>>>>>