సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 14, 2020 , 23:59:14

మొబైల్స్‌పై జీఎస్టీ మోత

మొబైల్స్‌పై జీఎస్టీ మోత
  • 12 నుంచి 18 శాతానికి పెరిగిన పన్ను..
  • ఏప్రిల్‌ 1 నుంచి అమలు.. ఫోన్ల ధరలు పెరిగేందుకు అవకాశం

న్యూఢిల్లీ, మార్చి 14: మొబైల్‌ ఫోన్లపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. శనివారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన 39వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొబై ల్‌ ఫోన్లు, పలు విడి భాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 18 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పన్ను రేటు 12 శాతం. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కాగా, పెరిగిన పన్ను భారంతో మొబైల్‌ ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనా నుంచి మొబైల్‌ తయారీ విడిభాగాల సరఫరా భారత్‌కు నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఈ క్రమంలో జీఎస్టీ పెంపు.. ఫోన్ల ధరలకు రెక్కలు తొడగవచ్చన్న అభిప్రాయాలు పరిశ్రమ నుంచి వ్యక్తమవుతున్నాయి. ధరలు పెరిగితే మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోవచ్చన్న ఆందోళనా వ్యాపారుల్లో కనిపిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంపైనా మండలి చర్చించింది.

అగ్గిపెట్టెలపై..

చేతితో, యంత్రాలతో తయారుచేసిన అగ్గిపుల్లలపై జీఎస్టీ రేటును 12 శాతానికి హేతుబద్ధీకరించారు. అలాగే ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం మెయింటేనెన్స్‌ రిపేర్‌ ఓవరాల్‌ సేవలపై పన్నును 18 శాతం నుంచి 5 శాతానికి దించారు. మరోవైపు రూ.2 కోట్లకు దిగువన టర్నోవర్‌ ఉన్న సంస్థలు, వ్యాపారులకు మండలి ప్రయోజనం చేకూర్చింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు (2017-18, 2018-19)గాను ఆలస్యంగా దాఖలు చేసిన వార్షిక రిటర్నులపై జరిమానాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆలస్యమైన జీఎస్టీ చెల్లింపుల కోసం జూలై 1 నుంచి నెట్‌ ట్యాక్స్‌ లయబులిటిపై వడ్డీని వేస్తామని నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అలాగే జీఎస్టీ నెట్‌వర్క్‌ హార్డ్‌వేర్‌ సామర్థ్యాన్ని పెంచాలని ఇన్ఫోసిస్‌కు సూచించారు.


logo