ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 24, 2021 , 21:33:13

సుంకాలు మోయ‌లేం.. జీఎస్టీ త‌గ్గించండి: ‌‌ఫోన్ ఇండ‌స్ట్రీ వేడికోళ్లు

సుంకాలు మోయ‌లేం.. జీఎస్టీ త‌గ్గించండి: ‌‌ఫోన్ ఇండ‌స్ట్రీ వేడికోళ్లు

న్యూఢిల్లీ: క‌రోనాతో త‌క్కిన రెవెన్యూ పూడ్చుకోవ‌డం.. మేడిన్ ఇండియా స్కీంలో భాగంగా దేశీయంగా ఉత్పాద‌కత పెంచి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో భాగంగా విదేశీ దిగుమ‌తుల‌పై ప్ర‌త్యేకించి సెల్‌ఫోన్లు, ఎల‌క్ట్రానిక్ గూడ్స్ మీద భారీగా దిగుమ‌తి సుంకాల భారం మోపేందుకు కేంద్రం సిద్ధ‌మైంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే, మొబైల్ ఫోన్స్ ఇండ‌స్ట్రీ బాడీ ఇండియా సెల్యూలార్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ అసోసియేష‌న్ (ఐసీఈఏ) మాత్రం ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న జీఎస్టీని త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తోంది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పించే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. 

గ‌తేడాది భారీగా జీఎస్టీ పెంపు

ప్ర‌తి భార‌తీయుడి చేతిలో సెల్‌ఫోన్ ఉండేలా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఐసీఈఏ చైర్మ‌న్ పంక‌జ్ మొహింద్రో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కానీ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి 2020 ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో సెల్‌ఫోన్ల‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ జీఎస్టీ 50 శాతం పెంచారు. ఇది సెల్‌ఫోన్ల ప‌రిశ్ర‌మ‌కు కోలుకోలేని దెబ్బ అని ఐసీఈఏ పేర్కొంది. ప్ర‌తి భార‌తీయుడి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల‌న్నా.. దేశీయ మొబైల్ ఫోన్ల మార్కెట్ 80 బిలియన్ల డాల‌ర్ల మైలురాయిని చేరాల‌న్నా జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి త‌గ్గించాల‌ని పంక‌జ్ మొహింద్రో ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

ఎల‌క్ట్రానిక్స్‌, మొబైల్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు కేటాయింపులు..

ఎల‌క్ట్రానిక్ రంగ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.500 కోట్లు, మొబైల్ డిజైన్ సెంట‌ర్ కోసం రూ.200 కోట్లు బ‌డ్జెట్‌లో కేటాయించాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రికి ఐసీఈఏ సిఫార‌సు చేసింది. మొబైల్ ప‌రిశ్ర‌మ‌కు ఐదుశాతం వ‌డ్డీరేటుపైనే రూ.1000 కోట్ల వ‌ర‌కు రుణాలివ్వాల‌ని, రూ.100 కోట్ల క్రెడిట్ గ్యారంటీ క‌ల్పించాల‌ని అభ్య‌ర్థించింది. దేశీయ స్మార్ట్‌ఫోన్ త‌యారీదారుల‌కు  ప్ర‌భుత్వం పూర్తిగా మ‌ద్ద‌తునిస్తోంద‌ని తెలిపింది. 

ఎగుమ‌తుల పెరుగుద‌ల‌తో సుంకాల‌తో స‌మ‌స్య‌లు

విదేశాలకు భారీగా మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేస్తున్న తరుణంలో దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంలో అర్థం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై వచ్చే బడ్జెట్‌లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని దేశీయ మొబైల్‌ మార్కెట్‌ రంగం కేంద్రాన్ని కోరుతోంది. 2021-22 బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. 

దిగుమ‌తి సుంకం త‌గ్గించండి ప్లీజ్‌..

20 శాతం దిగుమతి సుంకం తగ్గింపు లేదా ఒక్క మొబైల్‌పై రూ.4 వేల తగ్గింపు డిమాండ్లలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణించాలని సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీని వల్ల దేశీయ మొబైల్‌ తయారీ రంగం బలోపేతమవుతుందని వెల్లడించింది. తద్వారా ప్రపంచ సంస్థలతో పోటీ పడొచ్చని పేర్కొంది. ప్ర‌స్తుతం దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ‌లు ప్రస్తుతం విదేశాలకు లక్షల సంఖ్యలో మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేస్తున్న త‌రుణంలో దిగుమ‌తి చేసుకునే ఫోన్ల‌పై అధిక దిగుమతి సుంకాలు ఉండటంతో వ్యాపారం కష్టతరమైంద‌ని నిపుణులు అంటున్నారు. 2018-19లో 3.8 బిలియన్‌ డాలర్ల విలువైన మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేసి ప్రపంచంలోనే అత్యధికంగా ఫోన్ల ఎగుమతి దారుగా భారత్ నిలిచింది. 

ఫోన్ల ఉత్ప‌త్తిదారుల‌కు గ్రే మార్కెట్ బెడ‌ద‌

ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథకం కింద పెద్ద సంస్థలు సైతం దేశంలో ఉత్పత్తి ప్లాంట్ల స్థాపనకు ముందుకు వస్తున్నాయి. పీఎల్‌ఐ కింద శామ్‌సంగ్‌ సంస్థ సహా ఆపిల్‌ ఫోన్ల తయారీ కాంట్రాక్టును పొందిన ఫాక్స్‌కాన్‌ హోన్‌ హయ్‌, విస్ట్రాన్‌, పెగాట్రాన్‌ వంటి సంస్థలు కొత్త ప్లాంట్లను స్థాపించ‌డానికి ఆసక్తి చూపుతున్నాయి.అయితే మొబైల్‌ తయారీదారులను గ్రే మార్కెట్‌ బెడద వేధిస్తోంది. అనధీకృత సరఫరా వ్యవస్థ ద్వారా జ‌రిగే లావాదేవీల‌ను  గ్రే మార్కెట్‌ అంటారు. అధిక దిగుబడి సుంకాలు విధించ‌డం వల్ల గ్రే మార్కెట్ వృద్ధి చెందుతుంది. దేశంలో ప్రస్తుతం హైఎండ్‌ ఫోన్ల విక్రయాలు ఐదు శాతం. ఉదాహ‌ర‌ణకు ఒక హైఎండ్ ఆపిల్‌ ఫోన్‌ భారత్‌లోకంటే దుబాయ్‌లో రూ.40 వేల వరకు తక్కువగా వస్తోంది. ఇది వినియోగదారుడి దృష్ట్యా పెద్దమొత్తం.  

భార‌త్‌లోనే దిగుమ‌తి సుంకాలు అధికం

అధిక దిగుమ‌తి సుంకాల నేప‌థ్యంలో వినియోగదారులు గ్రే మార్కెట్‌ వైపు చూస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా అనంతర కాలంలో ఈ గ్రే మార్కెట్‌ను కట్టడిచేసి మొబైల్‌ మార్కెట్‌ రంగంలో పోటీతత్వం పెరిగేలా చూడాలని వారు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో తయారీని ప్రోత్సహించేందుకు ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2018-19 బడ్జెట్‌లో 15 నుంచి 20 శాతానికి పెంచారు.  2019-20 బడ్జెట్‌లో అదనంగా 10 శాతం సంక్షేమ సెస్‌ విధించారు. దీంతో దిగుమతి సుంకాలు భారీగా పెరిగాయి. తద్వారా మొబైల్‌ ఫోన్ల రేట్లు కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే దిగుమతి సుంకాలను తగ్గించాలని దేశీయ మొబైల్‌ మార్కెట్‌ రంగ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo