సోమవారం 01 మార్చి 2021
Business - Jan 27, 2021 , 02:08:56

ఈసారి మైనస్‌ 8%

ఈసారి మైనస్‌ 8%

దేశ జీడీపీపై ఫిక్కీ అంచనా

2021లో 11.5% వృద్ధిరేటు

ఈ ఏడాది భారత వృద్ధిరేటు ఆకర్షణీయంగా 11.5%గా నమోదు కావచ్చని మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది.  కరోనా వైరస్‌ ఇబ్బందుల్లోనూ రెండంకెల జీడీపీని నమోదు చేయగల ఏకైక దేశం ఇండియానేనని తాజాగా విడుదల చేసిన వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ అప్‌డేట్‌లో ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ తెలియజేశారు. కాగా, చైనా 8.1% జీడీపీని సాధించవచ్చన్న ఆమె ప్రపంచ వృద్ధిరేటు ఈసారి 5.5%గా ఉండొచ్చని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, జనవరి 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ మైనస్‌ 8 శాతంగా నమోదు కావచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసింది. ఫిక్కీ తమ తదుపరి విడుత ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ సర్వేను తాజాగా విడుదల చేసింది. పారిశ్రామిక, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వేను చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాల వృద్ధిరేటు 3.5 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నది. ‘ఈ కరోనా పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఆకర్షణీయ ప్రగతిని కనబరుస్తున్నది. పెద్ద ఎత్తున జరుగుతున్న రబీ సాగు, సమృద్ధిగా కురిసిన వర్షాలు, జలాశయాల్లోని అధిక నీటిమట్టాలు, పుంజుకున్న ట్రాక్టర్ల కొనుగోళ్లు.. వ్యవసాయ రంగంలోని ఉత్సాహానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి’ అని ఫిక్కీ తెలిపింది. అయితే పారిశ్రామిక, సేవా రంగాలను కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావితం చేసిందని, వీటిలో వృద్ధిరేటు మైనస్‌ 10 శాతం, మైనస్‌ 9.2 శాతంగా ఉండొచ్చన్నది. అయినప్పటికీ పారిశ్రామిక రంగం వృద్ధి బాట పట్టిందని, అయితే జీడీపీలో మాత్రం ఈ స్థాయి పరుగులు కనిపించడం లేదన్నది. పర్యాటక, ఆతిథ్య, వినోద, విద్య, ఆరోగ్య రంగాలు ఇంకా కోలుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. కాగా, ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 0.5 శాతం వృద్ధిని కనబర్చవచ్చన్న ఫిక్కీ.. 2020-21లో ఐఐపీని మైనస్‌ 10.7 శాతంగా అంచనా వేసింది. అయితే హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండవచ్చన్నది.

ఈ ఏడాది 7.3% వృద్ధి: ఐరాస

గతేడాది భారత జీడీపీ మైనస్‌ 9.6 శాతంగా నమోదు కావచ్చని ఐరాసఅంచనా వేసింది. ఈ ఏడాది మాత్రం 7.3 శాతం వృద్ధి కనిపిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2020 జీడీపీని లాక్‌డౌన్‌, ఇతర కరోనా నియంత్రణ చర్యలు దెబ్బతీశాయని పేర్కొన్నది. వినీమయం బాగా తగ్గి మార్కెట్‌ మందగమనంలోకి జారుకుందన్నది. 

‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి-అవకాశాలు 2021’ పేరుతో ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ సందర్భంగా 2020లో చోటుచేసుకున్న కరోనా సంక్షోభం.. వందేండ్లలో ఎప్పుడూ చూడలేదన్నది.


VIDEOS

logo