గురువారం 28 మే 2020
Business - May 13, 2020 , 00:47:01

లక్షల ఉద్యోగాలు ఔట్‌

లక్షల ఉద్యోగాలు ఔట్‌

  • గతవారం నిరుద్యోగరేటు 24 శాతం
  • వీక్లీ రిపోర్ట్‌లో సీఎంఐఈ వెల్లడి

న్యూఢిల్లీ, మే 12: కరోనా వైరస్‌ కట్టడికి దేశంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల గతనెలలో దాదాపు 2.7 కోట్ల మంది యువత (20 నుంచి 30 ఏండ్లలోపువారు) ఉద్యోగాలను కోల్పోయారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెల 10వ తేదీతో ముగిసిన వారంలో నిరుద్యోగ రేటు 27.1 శాతం నుంచి 24 శాతానికి తగ్గినట్టు సీఎంఐఈ తన వీక్లీ రిపోర్ట్‌లో పేర్కొన్నది. అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం దశలవారీగా పరిశ్రమలను తెరుస్తుండటంతో కార్మిక భాగస్వామ్యం 36.2 శాతం నుంచి 37.6 శాతానికి, ఉపాధి కల్పన రేటు 26.4 శాతం నుంచి 28.6 శాతానికి పెరిగిందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 20 నుంచి 24 ఏండ్ల వయసున్నవారు 8.5 శాతం మేరకు ఉన్నారు. గతనెల ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఈ వయసువారు 11 శాతం వరకు ఉన్నట్టు సీఎంఐఈ కన్జ్యూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌హోల్డ్‌ సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 3.42 కోట్ల మంది యువతీ, యువకులు పనిచేస్తున్నారని, ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరి సంఖ్య 2.09 కోట్లకు తగ్గిందని సీఎంఐఈ వెల్లడించింది. గతనెలలో ఉద్యోగాలు కోల్పోయినవారిలో 25 నుంచి 29 ఏండ్ల వయసువారు 1.4 కోట్ల మంది, 30 ఏండ్లు పైబడిన యువతీ, యువకులు 3.3 కోట్ల మంది ఉన్నట్టు సీఎంఐఈ వివరించింది. 


logo