ఆదివారం 24 మే 2020
Business - Mar 01, 2020 , 14:05:38

పాల ధరలు పైపైకి

పాల ధరలు పైపైకి

పాల ధరలు పైపైకి వెళ్తున్నాయి. గడిచిన 9 నెలలకుపైగా కాలంలో దేశవ్యాప్తంగా లీటర్‌ పాల ధర రూ.4-5 పెరిగింది. మార్కెట్‌లో క్రమేణా పెరుగుతూపోతున్న పాల ధరలకు కారణం ఉత్తరాది రాష్ర్టాల్లోని పరిస్థితులే. ఇవి మొత్తం దేశీయ పరిశ్రమనే ప్రభావితం చేస్తున్నాయి. తొలుత పాల ధరలను అముల్‌, మదర్‌ డైరీలు పెంచగా, మిగతా సంస్థలూ అదే బాట పట్టాయి. అంతకుముందుతో పోల్చితే నిరుడు ఏప్రిల్‌-డిసెంబర్‌లో దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా పాల సేకరణ ధరలు 19 శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. వచ్చే నెలాఖరుదాకా ఇదే పరిస్థితి ఉండొచ్చని రేటింగ్స్‌, రిసెర్చ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేస్తున్నది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: గతేడాది వేసవి కాలంలో ఎండిపోయిన జల వనరులు, ఆ తర్వాతి వర్షాకాలంలో సంభవించిన వరదలు.. డైరీ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేశాయి. నీరు, గడ్డి కొరతలతో పాల ఉత్పత్తి క్షీణించిందని పాల వ్యాపారులు చెప్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో అడుగంటిన భూగర్భ జలాలు పశువులకు నీటి ఎద్దడిని సృష్టించగా, ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో పంట పొలాలు, పచ్చిక బైళ్లు నీట మునిగి గడ్డి లభించకుండా పోయిందని వెల్లడించారు. ముఖ్యంగా మొక్కజొన్న, చెరకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పశువులకు గడ్డి లేకుండా పోయిందని, పాల ఉత్పత్తిని ఇది పెద్ద ఎత్తునే కుంగదీసిందని డైరీ యాజమాన్యాలు పేర్కొన్నాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు పశువుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపాయని క్రిసిల్‌ తెలిపింది.


ఎస్‌ఎంపీ కోసం ప్రయత్నాలు

దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న పాల ధరల దృష్ట్యా స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌ (ఎస్‌ఎంపీ) దిగుమతులను అనుమతించాలని ప్రైవేట్‌ డైరీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. న్యూజిలాండ్‌ వంటి దేశాల నుంచి ఎస్‌ఎంపీని దిగుమతి చేసుకుంటామని చెప్తున్నాయి. దేశీయంగా రోజుకు 500 మిలియన్‌ లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, అయినప్పటికీ సుమారు 50 మిలియన్‌ లీటర్ల కొరత ఉంటున్నదని సదరు సంస్థలు గుర్తుచేస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే ఎస్‌ఎంపీ దిగుమతి ఒక్కటే మార్గమని లాక్టలీస్‌ ఇండియా సీఈవో రాహుల్‌ కుమార్‌ అన్నారు. లక్ష టన్నుల ఎస్‌ఎంపీ దిగుమతులు వెంటనే అవసరమన్న ఆయన ప్రైవేట్‌ డైరీలతోపాటు సహకార సంఘాలకు దీన్ని అందించాలని సూచించారు.


వేసవిలో మరింతగా ధరలు

రాబోయే ఎండా కాలంలో పాల ధరలు మరింతగా పెరుగడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నీటి కొరత, పశువులకు ఆహార సమస్య.. ఉత్పత్తిని ఇంకా తగ్గించే వీలుందని, పెరిగే డిమాండ్‌తో ధరలు విజృంభిస్తాయని రాహుల్‌ హెచ్చరించారు. ఈ పరిస్థితులు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. దేశీయంగా ఎస్‌ఎంపీ ధరలు కిలో రూ.400 తాకవచ్చని, అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే ఇది 70% అధికమంటున్న ఆయన ఈ ధరకూ పౌడర్‌ దొరికే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. దీంతో విదేశీ దిగుమతులు పాల ధరల్ని తగ్గిస్తాయన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. మరోవైపు ఎస్‌ఎంపీ దిగుమతుల్ని అముల్‌, కెఎంఎఫ్‌ వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. పాల కొరత తాత్కాలికమని, విదేశాల నుంచి ఎస్‌ఎంపీ కొనుగోళ్లు దేశీయ రైతులకు నష్టమంటున్నాయి. 


గత 9 నెలల్లో లీటర్‌కు రూ.4-5 పెరుగుదల పరిశ్రమపై ఉత్తరాది పరిస్థితుల ప్రభావం పడిపోయిన ఉత్పత్తి, 


పెరిగిన డిమాండ్‌

లీటర్‌ పాలు   రూ.50

కిలో పెరుగు   రూ.80

వెన్న, నెయ్యి ధరలు కూడా 

ఎక్కువగానే ఉన్నాయి.


logo