మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 29, 2020 , 03:28:34

మైక్రోసాఫ్ట్‌పైనే మోజు

మైక్రోసాఫ్ట్‌పైనే మోజు

  • దేశంలో అత్యంత ఆకర్షణీయమైన సంస్థ
  • ర్యాండ్‌స్టడ్‌ సర్వేలో ఉద్యోగుల మాట

న్యూఢిల్లీ, జూలై 28: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా నిలిచింది. ర్యాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రిసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌) 2020 సర్వే ప్రకారం ఆర్థికంగా, పేరు-ప్రఖ్యాతలు, నూతన టెక్నాలజీల వినియోగంలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా అగ్రస్థానం దక్కించుకున్నది. 33 దేశాల్లోని 6,136 సంస్థల్లో పనిచేస్తున్న 1.85 లక్షల మంది (18-65 ఏండ్ల వయసువారు) అభిప్రాయాలతో ర్యాండ్‌స్టడ్‌ ఈ సర్వేను చేపట్టింది. ఈ క్రమంలో భారతీయ ఉద్యోగుల్లో 43 శాతం మంది మైక్రోసాఫ్ట్‌ కీర్తిని చూసి సంస్థలో పనిచేయాలని కోరుకోగా.. జీతం, ఉద్యోగ ప్రయోజనాలపట్ల ఆకర్షితులై 41 శాతం మంది, ఉద్యోగ భద్రత కారణంగా 40 శాతం మంది మైక్రోసాఫ్ట్‌ను ఎంచుకున్నారని తేలింది. ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు, టెలికం, ఆటోమోటివ్‌ సంస్థల్లో పనిచేసేందుకు ఎక్కువమంది భారతీయ ఉద్యోగులు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌, ఈ-కామర్స్‌, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు ఈ విషయంలో తర్వాతి వరుసలో నిలిచినట్లు ర్యాండ్‌స్టడ్‌ ఇండియా ఎండీ, సీఈవో పాల్‌ తెలిపారు.

సౌకర్యాలకే ఓటు

ఉద్యోగమిచ్చిన సంస్థల నుంచి వచ్చే ఆర్థికేతర సౌకర్యాలకే 81 శాతం మంది ఆకర్షితులవుతున్నట్లు ఈ సర్వేలో రుజువైంది. ఫోన్‌, కారు, పిల్లల సంరక్షణ సేవలు, అనువైన పని గంటలు తదితర అంశాలు ఉద్యోగం కోసం సంస్థల ఎంపికలో ప్రాధాన్యం కలిగి ఉన్నట్లు ర్యాండ్‌స్టడ్‌ తెలియజేసింది. 18-24 ఏండ్లవారిలో 38 శాతం మంది సంస్థ నుంచి మంచి శిక్షణను కోరుకుంటుండగా, 25-34 ఏండ్లవారిలో 34 శాతం మంది ఆధునిక టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. ఇక 35-54 ఏండ్లవారిలో దాదాపు 46 శాతం మంది అటు సంస్థకు, ఇటు వ్యక్తిగత జీవితానికి సమానంగా అధిక ప్రాధాన్యతనిస్తుండగా, 55-64 ఏండ్లవారిలో 32 శాతం మంది తమకు అనువైన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

టాప్‌-10లో మూడే

ర్యాండ్‌స్టడ్‌ తాజా సర్వేలో టాప్‌-10 ఆకర్షణీయ సంస్థల్లో భారత్‌కు చెందినవి మూడే ఉన్నాయి. ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లతోపాటు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ గ్రూప్‌ ఉన్నాయి. మొత్తం 10 సంస్థల్లో అమెరికాకు చెందినవి నాలుగుండగా, జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియాలకు చెందినవి ఒక్కోటి చొప్పున ఉన్నాయి.

మళ్లీ మంచి రోజులొ స్తాయ్‌

  • దేశ ఆర్థిక వ్యవస్థపై ఉద్యోగార్థుల విశ్వాసం

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి త్వరలోనే కోలుకోగలదన్న ఆశాభావాన్ని ఉద్యోగార్థులు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మంచి రోజులొస్తాయని, మా కెరియర్‌ బాగుంటుందన్న విశ్వాసాన్ని లింకెడిన్‌ సర్వేలో కనబరిచారు. జూన్‌ ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధంలో దేశ ఆర్థిక పరిస్థితులపై ఉద్యోగార్థుల్లో నమ్మకం పెరిగిందని లింకెడిన్‌ వర్క్‌ఫోర్స్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌లో స్పష్టమైంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో వచ్చిపడిన లాక్‌డౌన్‌ను జూన్‌ నుంచి క్రమేణా ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ-కామర్స్‌, ఐటీ సేవలు, బీమా, గేమింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు కనిపిస్తుండగా, నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నట్లు లింకెడిన్‌ సర్వేలో తేలింది.


దేశంలో టాప్‌-10 

ఆకర్షణీయ సంస్థలు

ర్యాంక్‌ సంస్థ 

  1     మైక్రోసాఫ్ట్‌

   2     సామ్‌సంగ్‌

   3     అమెజాన్‌

   4     ఇన్ఫోసిస్‌ 

   5     మెర్సిడెస్‌-బెంజ్‌

   6         సోనీ

   7     ఐబీఎం

   8     డెల్‌ టెక్నాలజీస్‌

   9     ఐటీసీ గ్రూప్‌

   10     టీసీఎస్‌logo