శనివారం 06 జూన్ 2020
Business - Apr 21, 2020 , 00:27:32

నిరాశలో వ్యాపారులు

నిరాశలో వ్యాపారులు

  • కరోనాతో దెబ్బతిన్న సెంటిమెంట్‌
  • ఏప్రిల్‌-జూన్‌లో రికార్డు స్థాయి కనిష్ఠానికి వ్యాపార ఆశావాదం
  • 2009 ఆర్థిక మాంద్యం కంటే దారుణమైన పరిస్థితి: డీఅండ్‌బీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: కస్టమర్లు రారు.. కొనుగోళ్లు లేవు.. వ్యాపారాలు మూతబడ్డాయి.. ఆదాయం దూరమైంది.. కరోనా వైరస్‌ నేపథ్యంలో వ్యాపారుల్లో సెంటిమెంట్‌ దారుణంగా దెబ్బతిన్నది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొమ్ములు వంచేందుకు భారత్‌లో లాక్‌డౌన్‌ ఆయుధాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రాణాల కోసం జరుగుతున్న ఈ పోరు లో ప్రజా ప్రభుత్వాలదే పైచేయిగా నిలుస్తున్నా.. వ్యాపారాలు స్తంభించి ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ప్రస్తుత ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వ్యాపార ఆశావాదం రికార్డు స్థాయిలో క్షీణించింది. డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ నివేదిక ప్రకారం 49.40 శాతంగా నమోదైంది. 2008-09 ప్రపంచ ఆర్థిక మాంద్యం నాటి కంటే కూడా ఇప్పుడు వ్యాపారులు నిరాశలో మునిగిపోయారని డీఅండ్‌బీ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే సూచీ ఏకంగా 37 శాతం పడిపోవడం గమనార్హం. ఇక 2008-09తో చూస్తే 7 శాతానికిపైగా క్షీణించింది. నాడు వ్యాపార ఆశావాదం 57 శాతంగా ఉన్నట్లు డీఅండ్‌బీ సమాచారం. లాక్‌డౌన్‌తో 18 ఏండ్ల కనిష్ఠానికి నికర అమ్మకాలు, లాభాలు కొత్త ఆర్డర్లు పడిపోయాయని డీఅండ్‌బీ ప్రధాన ఆర్థికవేత్త అరుణ్‌ సింగ్‌ అన్నారు.

ఉద్దీపనల లోటు

డీఅండ్‌బీ నివేదిక దేశంలో ఉద్దీపనల లోటుకు అద్దం పడుతున్నది. ఓవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నా.. అవి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. మోదీ సర్కారు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నదని తాజా వ్యాపార ఆశావాద సూచీనే తేటతెల్లం చేస్తున్నది. దేశంలో అనేక రాష్ర్టాలున్నా.. విత్త విధానం మాత్రం అంతిమంగా కేంద్ర ప్రభుత్వానిదే. అన్ని దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమ జీడీపీలో గరిష్ఠంగా 10 శాతం వరకు ఉద్దీపనల్ని ప్రకటిస్తున్నాయి. భారత్‌ మాత్రం 1.3 శాతం ఉద్దీపనలకే పరిమితమైంది. 

అమెరికా జీడీపీ విలువ దాదాపు 22 లక్షల కోట్ల డాలర్లు. కరోనా ధాటికి కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ట్రంప్‌ సర్కారు 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపనల్ని ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 215 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటిదాకా అటు కేంద్రం, ఇటు ఆర్బీఐ కలిసి ప్రకటించిన ఉద్దీపనలు 3 లక్షల కోట్ల రూపాయలలోపే.


logo