e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News జీఎస్టీ రేట్ల సమీక్ష.. 12, 18 శాతం శ్లాబ్‌ల విలీనంపై డిమాండ్లు

జీఎస్టీ రేట్ల సమీక్ష.. 12, 18 శాతం శ్లాబ్‌ల విలీనంపై డిమాండ్లు

మంత్రుల బృందాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 27: జీఎస్టీ రేట్లను, ఈ పన్ను మినహాయింపు పొందుతున్న ఐటెమ్స్‌ జాబితాను సమీక్షించేందుకు వివిధ రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన రెండు బృందాలను కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటుచేసింది. సంక్లిష్ట పరోక్ష పన్నుల వ్యవస్థ స్థానంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వచ్చి, నాలుగేండ్లు పూర్తయిన తర్వాత ప్రస్తుత జీఎస్టీ రేటు శ్లాబ్‌లను సమీక్షించి, సరళమైన రేట్ల వ్యవస్థను నెలకొల్పేదిశగా కేంద్రం, రాష్ర్టాలు కసరత్తుచేయడం మొదలుపెట్టాయి. రేట్‌ శ్లాబ్‌లతో పాటు ప్రత్యేక రేట్లు, రేట్‌ శ్లాబ్‌ల విలీన అంశాల్ని సమీక్షించేందుకు తాజాగా మంత్రుల బృందాల్ని ఏర్పాటుచేశారు. రేట్ల హేతుబద్దీకరణకు ఏర్పాటైన మంత్రుల గ్రూప్‌&జీఎస్టీ రిఫండ్‌ చెల్లింపుల్ని తగ్గించేందుకు విలోమ పన్నుల వ్యవస్థలో ఉన్న ఐటెమ్స్‌ను కూడా సమీక్షిస్తుంది. అలాగే పన్ను బేస్‌ను పెంచే లక్ష్యంతో జీఎస్టీ మినహాయింపు లభిస్తున్న వస్తువులు, సర్వీసుల సరఫరాల్ని సైతం సమీక్షచేస్తుంది. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వం వహించే ఏడుగురు సభ్యులు గల ఈ బృందంలో కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌, పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తార్‌కిషోర్‌ ప్రసాద్‌లతో పాటు గోవా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ మంత్రులు ఉన్నారు. ఈ గ్రూప్‌ రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తుంది.

- Advertisement -

వ్యవస్థాగత సంస్కరణలపై బృందం…
జీఎస్టీ వ్యవస్థాగత సంస్కరణలపై ఏర్పాటైన మంత్రుల బృందం… రెవిన్యూ లీకేజిని అరికట్టడానికి వ్యాపార ప్రక్రియలు, ఐటి సిస్టమ్స్‌లో చేయాల్సిన మార్పుల్ని సూచిస్తుంది. ఎనిమిదిమంది సభ్యులుగల ఈ బృందానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌, చత్తీస్‌గఢ్‌ ఆర్థిక మంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అస్సాం మంత్రులు ఈ బృందంలో ఉన్నా రు. పన్ను అధికారులకు అందుబాటులో ఉన్న ఐటీ టూల్స్‌, ఇంటర్‌ఫేస్‌లను ఈ బృందం సమీక్షించి, వాటిని మరింత సమర్థవంతం చేయడానికి సూచనలు చేస్తుంది. కేంద్ర, రాష్ర్టాల పన్ను అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపర్చడానికి మార్గాలను సిఫార్సుచేస్తుంది. జీఎస్టీ కౌన్సిల్‌కు ఈ బృందం ఎప్పటికప్పుడు నివేదికల్ని సమర్పిస్తుంది. ఈ మంత్రుల బృందాల్ని ఏర్పాటుచేయాలన్న నిర్ణయాన్ని సెప్టెంబర్‌ 17న జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకొన్నారు.

12, 18 శాతం శ్లాబ్‌ల విలీనంపై డిమాండ్లు
జీఎస్టీ కింద ప్రస్తుతం నాలుగు రేట్ల వ్యవస్థ అమలులో ఉంది. నిత్యావసరాలపై కనిష్టంగా 5 శాతం, కార్లపై గరిష్టంగా 28 శాతం పన్ను వేస్తున్నారు. కొన్ని ఉత్పత్తుల, సేవలపై 12, 18 శాతం శ్లాబ్‌లు అమల్లో ఉన్నాయి. అలాగే కొన్ని లగ్జరీ, హానికారక ఉత్పత్తులపై 28 శాతం గరిష్టశ్లాబ్‌తో పాటు సెస్‌ను కూడా విధిస్తున్నారు. రేట్లను హేతుబద్దీకరించడం ద్వారా ఆదాయంపై పడే ప్రభావాన్ని సమతౌల్యం చేసేందుకు 12, 18 శాతం శ్లాబ్‌లను విలీనం చేయాలని, కొన్ని ఐటెమ్స్‌ను మినహాయింపు క్యాటగిరీ నుంచి తొలగించాలన్న డిమాండ్లు ప్రస్తుతం ఉన్నాయి. విలోమ పన్ను వ్యవస్థకు ( తుది ఉత్పత్తిపై పడే పన్ను కంటే ఆ ఉత్పత్తి తయారీకయ్యే ముడి సరుకులపై అధిక దిగుమతి సుంకం ఉండటం) సంబంధించి జీఎస్టీ కౌన్సిల్‌ ఇప్పటికే మొబైల్‌ హ్యాండ్‌సెట్లు, పాదరక్షలు, టెక్స్‌టైల్స్‌ రేట్లను సరిచేసింది. మరిన్ని ఉత్పత్తుల విలోమ పన్నుల్ని సవరించేందుకు వస్తున్న విజ్ఞప్తుల్ని ఇప్పుడు మంత్రుల బృందం పరిశీలించి, తగిన రేట్లను సిఫార్సుచేస్తుంది.

రేపు దక్షిణాది రాష్ర్టాల జీఎస్టీ సదస్సు
హాజరుకానున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మొట్టమొదటిసారిగా నాలుగు దక్షిణాది రాష్ర్టాల కౌన్సిళ్లతో జీఎస్టీ సదస్సును నిర్వహిస్తున్నట్లు వాణిజ్య సమాఖ్య ఫిక్కీ తెలిపింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలవరకూ వర్చువల్‌గా జరిగే ఈ సదస్సులో నాలుగు రాష్ర్టాల మంత్రులు పాల్గొంటారని ఫిక్కీ సోమవారం తెలిపింది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు, తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌, కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్‌, కర్నాటక పరిశ్రమల మంత్రి మురుగేశ్‌ ఆర్‌ నిరానిలు సదస్సులో పాల్గొంటారు. సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలు, ఆందోళనల్ని పొందుపర్చి, ఒక నివేదిక రూపంలో కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించనున్నట్లు ఫిక్కీ తెలిపింది. జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ర్టాల మధ్య సీజీఎస్టీ ఆదాయ పంపిణీలో కొన్ని రాష్ర్టాలు లబ్దిపొందుతుండగా, దక్షిణాది రాష్ర్టాలు బాగా నష్టపోతున్న నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఫిక్కీ తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement