గురువారం 28 మే 2020
Business - May 16, 2020 , 02:49:06

2026లోనే ఈ ఘనత సాధించనున్న బెజోస్‌

2026లోనే ఈ ఘనత సాధించనున్న బెజోస్‌

  • 2033 నాటికిట్రిలియనీర్‌గా ముకేశ్‌
  • వ్యాపార సలహా సంస్థ ‘కంపారిసన్‌' అంచనా

న్యూఢిల్లీ, మే 15: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ‘అమెజాన్‌' అధిపతి జెఫ్‌ బెజోస్‌ 2026 నాటికి ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా ఆవిర్భవించే అవకాశమున్నది. ప్రస్తుతం బెజోస్‌ 143 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 56 ఏండ్ల వయసులో ఉన్న బెజోస్‌కు 62 ఏండ్లు వచ్చేసరికి ఆయన నికర సంపద 1000 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని వ్యాపార సలహా సంస్థ ‘కంపారిసన్‌' నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం భారత్‌లోనే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 2033 నాటికి ఈ ఘనత సాధించి ప్రపంచంలో ఐదవ ట్రిలియనీర్‌గా ఆవిర్భవిస్తారని కంపారిసన్‌ పేర్కొన్నది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజీలో లిస్టయిన కంపెనీల్లో అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన సంస్థలతోపాటు ‘ఫోర్బ్స్‌' జాబితాలోని టాప్‌-25 శ్రీమంతుల సంపదను, వారి వ్యాపారాలను విశ్లేషించి కంపారిసన్‌ ఈ అంచనా వేసింది. ప్రపంచంలో బెజోస్‌ తర్వాత చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం జు జియాయిన్‌ రెండవ ట్రిలియనీర్‌గా ఆవిర్భవించవచ్చని తెలిపింది. లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు  డిమాండ్‌ పెరుగడం తో భవిష్యత్తులో అమెజాన్‌ వ్యాపారం గణనీయంగా వృద్ధిచెందే అవకాశమున్నది. గతేడాది జనవరి-మార్చిలో 60 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అమెజాన్‌ వ్యాపారం.. ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో 75 బిలియన్‌ డాలర్లు దాటడం గమనార్హం. logo