శనివారం 08 ఆగస్టు 2020
Business - Jul 27, 2020 , 00:38:39

ఆరోగ్య బీమాకు జై

ఆరోగ్య బీమాకు జై

  • కరోనా ఇన్సూరెన్స్‌లకు పెరిగిన డిమాండ్‌

ఇన్నాళ్లూ ఆరోగ్య బీమాను తేలిగ్గా తీసుకున్నవాళ్లు ఇప్పుడు ‘బీమా ఉంటేనే భరోసా’ అని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం, ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యానికి రూ.లక్షలు ఖర్చవుతుండటంతో బీమా ఉంటేనే బెటర్‌ అని చాలామంది అనుకుంటున్నారిప్పుడు. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగళూరు వంటి మెట్రో నగరవాసులు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ప్రముఖ బీమా సంస్థ ‘మ్యాక్స్‌ బూపా’ హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర దేశంలోని 11 నగరాల్లో ఓ అధ్యయనం చేసింది. ఇందులో కరోనాతో హైదరాబాదీల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపించిందని తేలింది. కొవిడ్‌-19 విజృంభణకు ముందు హైదరాబాద్‌లో 22 శాతం మంది మాత్రమే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపేవారు. ఇప్పుడిది ఏకంగా 84 శాతానికి పెరుగడం గమనార్హం. ఇందులో 80 శాతం మంది కరోనా చికిత్స కవరేజీ ప్లాన్ల కోసమే వెతుకుతున్నారు. ఇప్పటికే ఇతర బీమా పాలసీలు తీసుకున్నవారిలోనూ 68 శాతం మంది కరోనా కవరేజీ కోసం అదనంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని మ్యాక్స్‌ బూపా చెప్పింది. 3 నెలలు మొదలు ఏడాది వరకు వర్తించేలా పాలసీలు స్వీకరిస్తున్నారు. దీనికి తగ్గట్టే అనేక బీమా సంస్థలు క్లయిమ్‌ చేసిన అరగంటలోపే క్యాష్‌లెస్‌ చికిత్సకు అప్రూవల్స్‌ ఇస్తున్నాయని మ్యాక్స్‌ బూపా వెల్లడించింది.

సర్వే ముఖ్యాంశాలు 

  • కొవిడ్‌కు ముందు 75% మంది హైదరాబాదీలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరం లేదని చెప్పారు
  • ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా చికిత్స ఖర్చులు పెరిగిపోవడంపై 89% మంది ఆందోళన వ్యక్తం చేశారు
  • 41% మంది తమకు సమగ్ర ఆరోగ్య బీమా కావాలని అడిగారు 
  • మహిళల్లో 71% మంది తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించే ఆందోళన చెందారు
  • మెట్రో నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. 
  • ఆన్‌లైన్‌లో బీమా ధరఖాస్తుల సంఖ్య కూడా పుంజుకున్నది


logo