మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 25, 2020 , 23:39:24

మారిషస్‌ మదుపరులూ అర్హులే

మారిషస్‌ మదుపరులూ అర్హులే
  • మరింత నిఘా మధ్య కొనసాగనున్న ఎఫ్‌పీఐ నమోదు: సెబీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: మారిషస్‌కు చెందిన విదేశీ మదుపరులూ భారత్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ)గా నమోదు కావచ్చని మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ మంగళవారం స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మరింత నిఘా ఉంటుందని తెలిపింది. మనీ లాండరింగ్‌ నిరోధక ప్రమాణాలను నిర్దేశించే ద్వంద్వ ప్రభుత్వాల విధాన రూపకల్పన సంఘం ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్టులో పన్ను ఎగవేతదారులకు స్వర్గధామం మారిషస్‌ను పెట్టిన నేపథ్యంలో సెబీ పైవిధంగా ప్రకటించింది. ఎఫ్‌ఏటీఎఫ్‌ నోటీసుతో కొందరు ఫండ్‌ మేనేజర్లు వెంటనే సెబీ తలుపు తట్టారు. మారిషస్‌ ద్వారా నమోదైన ఎఫ్‌పీఐల కాలపరిమితిపై ఆందోళనల్ని వెలిబుచ్చారు. 


ఈ క్రమంలోనే ఎఫ్‌పీఐ నమోదు కోసం మారిషస్‌ నుంచి వచ్చే విదేశీ మదుపరులకూ అవకాశం ఉంటుందని, అయితే ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనల ప్రకారం వీరిపై నిఘా పెరుగుతుందని సెబీ స్పష్టత ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న ఎఫ్‌పీఐల్లో మారిషస్‌కు చెందినవారు ఎక్కువే. అమెరికా తర్వాత మారిషస్‌ ఎఫ్‌పీఐలదే రెండో స్థానం. జనవరి ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాల ప్రకారం అమెరికాకు చెందిన ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ రూ.11,62,579 కోట్లుగా ఉన్నది. మారిషస్‌ ఎఫ్‌పీఐల విలువ రూ.4,36,745 కోట్లుగా ఉన్నది. కొన్నేండ్లుగా మారిషస్‌ పెట్టుబడుల చుట్టూ మనీ లాండరింగ్‌ ఆరోపణలు అలుముకోగా.. మారిషస్‌ దీనిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టు. ఈ లిస్టులోని దేశాలపై నిఘా ఎక్కువగా ఉంటుంది. 


logo
>>>>>>