మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 25, 2020 , 23:54:06

మాస్టర్‌కార్డ్‌కు కొత్త సీఈవో

మాస్టర్‌కార్డ్‌కు కొత్త సీఈవో
  • ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా అజయ్‌ బంగా
  • వచ్చే జనవరి నుంచి మార్పులు

న్యూయార్క్‌, ఫిబ్రవరి 25: మాస్టర్‌కార్డ్‌ భారత సంతతి అధ్యక్షుడు, సీఈవో అజయ్‌ బంగా.. సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమితులు కానున్నారు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడు, సీఈవోగా మైఖేల్‌ మేబ్యాచ్‌ రానున్నట్లు ఓ ప్రకటనలో మాస్టర్‌కార్డ్‌ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మాస్టర్‌కార్డ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా దశాబ్దకాలానికిపైగా సేవలందించిన రిచర్డ్‌ స్థానంలో బంగా బాధ్యతల్లోకి వస్తారని స్పష్టం చేసింది. అదే రోజు నుంచి సంస్థ ప్రస్తుత చీఫ్‌ ప్రోడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న మేబ్యాచ్‌.. సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారన్నది. అయితే ఈ ఏడాది మార్చి 1 నుంచే అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించింది. అధ్యక్షుడిగా సేల్స్‌, మార్కెటింగ్‌, ప్రోడక్ట్స్‌, సర్వీసెస్‌, టెక్నాలజీ ఆర్గనైజేషన్స్‌ను ఆయన పర్యవేక్షించనున్నారు. మేబ్యాచ్‌ నియామకాన్ని సంస్థ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఈ సందర్భంగా మాస్టర్‌కార్డ్‌ వెల్లడించింది. 2010 నుంచి అజయ్‌ బంగా మాస్టర్‌కార్డ్‌ సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 


ఆయన నాయకత్వంలో సంస్థ ఆదాయం 5.5 బిలియన్‌ డాలర్ల నుంచి 16.9 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. షేర్ల విలువ కూడా 1,600 శాతానికిపైగా ఎగబాకింది. ఈ క్రమంలో తమ ప్రధాన ప్రత్యర్థి సంస్థ వీసాకార్డును మాస్టర్‌కార్డ్‌ సులభంగానే అధిగమించగలిగింది. ‘ఇన్నేండ్లు నాతో కలిసి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు’ అని అజయ్‌ బంగా అన్నారు. ఇకపైనా ఇదే ప్రగతితో ముందుకెళ్లగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికా బహుళజాతి సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారత సంతతి వ్యక్తుల్లో అజయ్‌ బంగా మాస్టర్‌కార్డే చిన్న సంస్థ. గత నెల అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం సీఈవోగా అర్వింద్‌ కృష్ణ నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్‌-గూగుల్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌ ఉన్నారు. సుదీర్ఘకాలంపాటు పెప్సీకో సీఈవోగా ఇంద్రా నూయీ పనిచేసిన సంగతి విదితమే.


logo
>>>>>>