శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 01, 2021 , 02:32:32

వాహన ధరల మోత

వాహన ధరల మోత

నూతన సంవత్సరంలో కార్లు, బైకులను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబుకు పెద్ద చిల్లులు పడబోతున్నాయి. కొవిడ్‌-19 సంక్షోభంతో అమ్మకాలు క్షీణించి తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆటోమొబైల్‌ సంస్థలు.. 2021 ఆరంభంలోనే గట్టి షాకివ్వబోతున్నాయి. అమ్మకాలను పెంచుకోవడానికి డిసెంబర్‌ నెలలో రాయితీలు గుప్పించిన కంపెనీలు.. జనవరి నుంచే వాహన ధరలను పెంచబోతున్నాయి. ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యవయం పెరుగడంతో ఈ భారాన్ని కొనుగోలుదారులపై మోపనున్నట్లు అన్ని సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

మారుతి సుజుకీ ..

కొనుగోలుదారులపై మారుతి సుజుకీ కూడా భారం మోపుతున్నది. స్టీల్‌, అల్యుమినియం, రాగి, రబ్బర్‌ ధరలు పెరుగడం వల్లనే ధరలను పెంచాల్సి వస్తున్నదని కంపెనీ అంటున్నది. సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు తెలిపింది. ఎంట్రీ లెవల్‌ స్మాల్‌ కారు ఆల్టో నుంచి ప్రీమియం వాహనమైన ఎక్స్‌ఎల్‌6 వరకు అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

హ్యుందాయ్‌..

రెండో అతిపెద్ద కార్ల సంస్థ హ్యుందాయ్‌ నూతన సంవత్సరంలో షాకిచ్చింది. అన్ని రకాల కార్లను ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంతమేర పెంచుతున్నదో మాత్రం వెల్లడించలేదు. 

మహీంద్రా...

దేశీయ ఆటోమొబైల్‌ సంస్థల్లో ఒకటైన మహీంద్రా కూడా తన వాహన ధరలను సవరించింది. కమర్షియల్‌ వాహనాలతోపాటు ప్యాసింజర్‌ వాహనాలు, ట్రాక్టర్లు సైతం ప్రియంకాబోతున్నాయి. మోడళ్ళను బట్టి ధరల పెంపు ఉంటుందని సంకేతాలిచ్చింది. 

హోండా..

వాహన ధరలను ఎంత శాతం పెంచుతున్నదో మాత్రం హోండా ప్రకటించలేదు. కానీ జనవరి నుంచి మాత్రం ధరల పెంపు తప్పదని సంకేతాలిచ్చింది. ఉత్పత్తి వ్యయం, కరెన్సీ హెచ్చుతగ్గుదలతో ధరల పెంపు తప్పదని కంపెనీ వర్గాలు సంకేతాలిచ్చాయి. 

ఫోర్డ్‌ ఇండియా 

జనవరి 1 నుంచి అన్ని వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచాలని ఫోర్డ్‌ ఇండియా కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వాహన ధరలు రూ.5 వేల నుంచి రూ.35 వేల వరకు పెరగనున్నాయి.  

స్కోడా సైతం

జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా వాహన ధరలను 2.5 శాతం వరకు సవరిస్తున్నట్లు స్కోడాతెలిపింది. 

ఎంజీ మోటర్‌

ధరల పెంపుపై తీవ్రంగా ఆలోచిస్తున్నది ఎంజీ మోటర్‌. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు మోడళ్ళను విక్రయిస్తున్న సంస్థ.. వీటి ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 

రెనో 28 వేలు పెంపు

మరోవైపు రెనో తమ వాహన ధరలను రూ.28 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం, ముడి సరుకుల ధరలు అధికమవడం ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

బీఎండబ్లూ

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా తన వాహన ధరలను 4% వరకు సవరించింది. కొత్త ధరలు జనవరి 4 నుంచి అమలులోకి రానున్నాయి. 

కారణాలు

  • గత ఆరు నెలల్లో స్టీల్‌ ధరలు 30 శాతం పెరుగడం
  • అల్యుమినియం ధరలు 40 శాతం ఎగబాకడం 
  • రాగి విలువ కూడా 77 శాతం అధికమైంది. 

VIDEOS

logo