గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 03, 2020 , 02:42:33

లీజుకు మారుతి కార్లు

లీజుకు మారుతి కార్లు

  • నాలుగేండ్ల కాలపరిమితితో లభించనున్న వాహనాలు

న్యూఢిల్లీ, జూలై 2: కరోనా వైరస్‌తో అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన తయారీ సంస్థలు పంథాను మార్చుకుంటున్నాయి.  దీంట్లో భాగంగా వాటి వద్ద పేరుకుపోయిన కార్లను లీజుకు ఇవ్వడానికి సైతం సిద్ధమయ్యాయి.  ఇప్పటికే హ్యుందాయ్‌, ఎంజీ మోటార్‌, ఫోక్స్‌వ్యాగన్‌లు ఇలాంటి సేవలను ఆరంభించగా.. తాజాగా కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ సైతం ఈ సేవలకు శ్రీకారం చుట్టింది.  సబ్‌స్క్రిప్షన్‌ పద్ధలో వ్యక్తిగతంగా లీజుకు తీసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఓరిక్స్‌ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. 

పైలెట్‌ ప్రాజెక్టు కింద గుర్గావ్‌, బెంగళూరులో ఈ సేవలను ఆరంభించిన సంస్థ.. భవిష్యత్తులో ఇతర నగరాలకు విస్తరించేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. స్విఫ్ట్‌, డిజైర్‌, విటారా బ్రెజ్జా, ఎర్టిగా మోడళ్లను సుజుకీ అరెనా చానెల్‌ కింద.. బాలెనో, సియాజ్‌, ఎక్స్‌ఎల్‌6లను నెక్సా చానెల్‌ కింద లీజుకు ఇస్తున్నట్లు మారుతి తెలిపింది. రెండేండ్ల నుంచి నాలుగేండ్ల కాలపరిమితితో లభిస్తున్న ఈ కార్లు వ్యక్తిగత, కార్యాలయ అవసరాలనిమిత్తం కార్పొరేట్‌ సంస్థలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాహనాన్ని వాడుకున్నందుకు, నిర్వహణ, బీమా కోసం చెల్లింపులు జరుపాల్సి ఉంటుంది. లీజుకిచ్చే కార్లలో కొత్తవే ఉంటాయని, పాత కార్లను వాడే అవకాశాలు లేవని స్పష్టంచేసింది. గత నెలలో మారుతి విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 54 శాతం తగ్గి 57,428కి చేరుకున్నాయి. రెండు నెలల క్రితం హ్యుందాయ్‌ దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ప్రారంభించిన వాహన లీజు సేవలకు అనూహ్య స్పందన రావడంతో మిగతా సంస్థలు కూడా అదేబాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మారుతి లీజుకు ఇచ్చే కార్ల వివరాలు

స్విఫ్ట్‌, డిజైర్‌, బాలెనో, బ్రెజ్జా, సియాజ్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌, ఎర్టిగా కాలపరిమితి: 24, 36, 48 నెలల్లో

సరికొత్తగా డబ్ల్యూఆర్‌-వీ

ధర రూ.8.5 లక్షలు


ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్‌ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ ‘డబ్ల్యూఆర్‌-వీ’ని తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో తెచ్చిన ఈ కారు రూ.8.5 లక్షలు మొదలుకొని రూ.11 లక్షలలోపు ధరలో లభించనున్నది. ఇవి ఢిల్లీ ఎక్స్‌షోరూం ధరలు. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ మోడళ్లలో పెట్రోల్‌ వెర్షన్‌ను రూ.8.5 లక్షల నుంచి రూ.9.7 లక్షలకు, డీజిల్‌ మోడల్‌ను రూ.9.8 లక్షల నుంచి రూ.11 లక్షలకు విక్రయించనున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈవో  గాకు నకనిశి తెలిపారు. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో తయారైన  కారు 16.5 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, 1.5 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన కారు 23.7 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. వన్‌-టచ్‌ ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, టచ్‌స్క్రీన్‌ ద్వారా ఏసీని నియంత్రించవచ్చు. రెండు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌, మల్టీ-వ్యూ రియర్‌ కెమెరా, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్‌ వంటి నూతన ఫీచర్లున్నాయి. 


logo