మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 12, 2021 , 02:53:13

మళ్లీ రికార్డుల్లో మార్కెట్లు

మళ్లీ రికార్డుల్లో మార్కెట్లు

ముంబై, ఫిబ్రవరి 11: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ లాభాలను సంతరించుకున్నాయి. వరుసగా రెండు రోజులు స్వల్ప నష్టాల్లో కదలాడిన సూచీలు.. గురువారం భారీ లాభాల దిశగా పయనించాయి. ఫలితంగా మరో ఆల్‌టైమ్‌ హై వద్ద స్థిరపడ్డాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 222.13 పాయింట్లు లేదా 0.43 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా 51,531.52 వద్ద నిలిచింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 66.80 పాయింట్లు లేదా 0.44 శాతం ఎగిసి గతంలో ఎప్పుడూ లేనంతగా 15,173.30 వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లకు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి సమీప భవిష్యత్తులోనూ కీలక వడ్డీరేట్లను తక్కువగానే ఉంచుతామని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ వ్యాఖ్యలు మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లు లాభాల్లోకి దూసుకు రాగా.. రిలయన్స్‌ షేర్‌ విలువ గరిష్ఠంగా 4.07 శాతం పెరిగింది. సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. బీఎస్‌ఈ ఎనర్జీ, టెలికం, చమురు, గ్యాస్‌, యుటిలిటీస్‌, బేసిక్‌ మెటీరియల్స్‌, మెటల్‌ సూచీలు 3.13 శాతం వరకు పెరిగాయి. అయితే క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఇండస్ట్రియల్‌ షేర్లు నష్టపోయాయి. ఇక ప్రధాన ఆసియా మార్కెట్లకు సెలవుండగా, ఐరోపా మార్కెట్లు మాత్రం లాభాల్లోనే కదలాడాయి.

51,530 ఎగువన సెన్సెక్స్‌, 

15,200లకు చేరువలో నిఫ్టీ


VIDEOS

logo