మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 21, 2021 , 01:28:32

సెన్సెక్స్‌ దూకుడు

సెన్సెక్స్‌ దూకుడు

  • 50 వేలకు చేరువలో సూచీ భారీ లాభాల్లో మార్కెట్లు

ముంబై, జనవరి 20: దేశీయ స్టాక్‌ మార్కెట్ల లాభాల జోరు కొనసాగుతున్నది. వరుసగా రెండోరోజు బుధవారం సూచీ 50 వేల పాయింట్లకు చేరువైంది. అమెరికా నూతన ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు వచ్చిన సంకేతాలతో సూచీలు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. ఐటీ, ఫార్మా రంగ షేర్లు కదంతొక్కడంతో 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 393.83 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 49,792.12కి తాకింది.  జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ మరో 123.55 పాయింట్లు పెరిగి ఆల్‌టైం హై 14,644.70 పాయింట్లకు చేరుకున్నది. కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు మళ్లీ ఊతమివ్వడానికి అమెరికా ట్రెజరీ కార్యదర్శిగా జనెట్‌ యెల్లెన్‌ నియమిస్తూ అమెరికా నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. మారుతి షేరు ధర 2.75 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టెక్‌ మహీంద్రా, మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ వంటి బ్లూచిప్‌ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. కానీ, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీలు నష్టపోయాయి. అంచనాలకుమించి కార్పొరేట్‌ సంస్థలు ఆర్థిక ఫలితాలు ప్రకటించడం, వాహన, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్ళు ఊపందుకున్నాయి. రంగాలవారీగా చూస్తే వాహన, ఇంధనం, ఐటీ, టెక్‌ రంగ షేర్లు లాభపడగా..యుటిలిటీ, ఎఫ్‌ఎంసీజీ, టెలికం షేర్లు నష్టపోయాయి. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగి 73.05 వద్ద ముగిసింది.  

VIDEOS

logo