తొలిసారి రికార్డు స్థాయికి మదుపరుల సంపద

- దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పోటెత్తుతున్న పెట్టుబడులు
- పరుగులు పెడుతున్న బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ
‘దేశ సంపద సృష్టిలో బీఎస్ఈ కీలకపాత్ర పోషిస్తుండటం ఆనందంగా ఉన్నది. భారత్‌తో పోల్చితే మరే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ క్యాపిటల్ మార్కెట్లు ఈ స్థాయిలో రాణించడం లేదు. నమోదిత సంస్థలు, మార్కెట్ విలువ ఆధారంగా ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్‌ల్లో బీఎస్ఈకి 9వ స్థానం ఉన్నది’
-ఆశిష్‌కుమార్ చౌహాన్, బీఎస్ఈ ఎండీ, సీఈవో
బీఎస్ఈ విశేషాలు
- 1875 జూలై 9న స్థాపించారు
- ముంబైలో ప్రధాన కేంద్రం
- 1986 జనవరి 1న మొదలైన ప్రధాన సూచీ సెన్సెక్స్
- 2014 నవంబర్ 28న రూ.100
- లక్షల కోట్లకు చేరిన బీఎస్ఈ సంస్థల మార్కెట్ విలువ
- గతేడాది రూ.32.49 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద
- కరోనా వైరస్‌తోనే మునుపెన్నడూ లేని ఒడిదుడుకులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ.. మదుపరుల సంపదను పరుగులు పెట్టిస్తున్నది. రికార్డు లాభాలు.. సంస్థల మార్కెట్ విలువను చారిత్రక స్థాయిలకు చేర్చుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల వరుస లాభాలు గురువారం కూడా కొనసాగాయి. దీంతో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రూ.200 లక్షల కోట్లను దాటేసింది. జనవరి 21 నుంచి వరుసగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్లు.. బడ్జెట్ ఉత్సాహంతో ఫిబ్రవరి 1 నుంచి లాభాలను సంతరించుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఒక్కరోజే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,315 పాయింట్లు పుంజుకున్నది. 1997 తర్వాత బడ్జెట్ రోజున ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. తర్వాతి రోజుల్లోనూ లాభాల జోరు కొనసాగగా, గడిచిన నాలుగు రోజుల్లో (ఫిబవరి 1-4) సెన్సెక్స్ 4,328.52 పాయింట్లు లేదా 9.35 శాతం ఎగిసింది. ఈ క్రమంలోనే రూ.14.34 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఎగబాకింది. గురువారం ఇది రూ.2,00,47,191.31 కోట్ల (2.75 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.
మరో సరికొత్త స్థాయికి మార్కెట్లు
- సెన్సెక్స్ 358, నిఫ్టీ 106 పాయింట్లు వృద్ధి
స్టాక్ మార్కెట్లు గురువారం మరో సరికొత్త స్థాయిని చేరుకున్నాయి. గత మూడు రోజుల లాభాలను కొనసాగిస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 358.54 పాయింట్లు లేదా 0.71 శాతం ఎగిసింది. దీంతో ఆల్‌టైమ్ హై 50,614.29 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 50,687.51 పాయింట్లను తాకి ఇంట్రా-డే రికార్డును నెలకొల్పింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 105.70 పాయింట్లు లేదా 0.71 శాతం పెరిగింది. ఫలితంగా మునుపెన్నడూ లేనివిధంగా 14,895.65 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 14,913.70 పాయింట్లను చేరి ఆల్‌టైమ్ ఇంట్రా-డే హైని చేరింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్ష నిర్ణయాలు వస్తున్నా.. మదుపరులు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ఇక సెన్సెక్స్‌లో ఐటీసీ షేర్ విలువ అత్యధికంగా 6.11 శాతం పుంజుకున్నది. ఎస్బీఐ షేర్ విలువ కూడా 5.73 శాతం ఎగిసింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ రూ.17,179 కోట్లు ఎగబాకి రూ.3,16,912.96 కోట్లకు చేరింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాలను ప్రకటించడమే కారణం. బ్యాంక్ మొండి బకాయిలు తగ్గడం కూడా మదుపరులను ఆకట్టుకున్నది. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలూ 1.45 శాతం లాభపడ్డాయి.
ఫ్లాట్‌గా ముగిసిన రూపాయి
స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడినప్పటికీ రూపాయి మాత్రం స్థిరంగా కొనసాగుతున్నది. రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్ష కంటే ముందు కరెన్సీ విలువ యథాతథంగా నిలిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.96 వద్ద నిలిచింది. పరపతి సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలున్నట్లు వచ్చిన సంకేతాలు రూపాయి పరుగుకు బ్రేక్‌లు వేశాయి. 72.92 వద్ద ప్రారంభమైన రుపీ-డాలర్ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 72.90 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 72.96 వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్
- రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా
- గాలి సంపత్ నుండి 'పాప ఓ పాప..' వీడియో సాంగ్ విడుదల