శనివారం 06 జూన్ 2020
Business - May 02, 2020 , 01:15:51

నగదు ముద్రణే మార్గం

నగదు ముద్రణే మార్గం

  • క్యూఈ, హెలికాప్టర్‌ మనీపై పలు దేశాల దృష్టి
  • మార్కెట్లో నగదు చెలామణి పెంచడమే లక్ష్యం
  • మోదీ సర్కార్‌ ఇకనైనా మెల్కోంటుందో లేదో?
  •  ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి అదే మందు

హైదరాబాద్‌: ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 మహమ్మారి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సాహసోపేతమైన ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (క్యూఈ)లో భాగంగా నగదు ముద్రణ చేపట్టాలని ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. తద్వారా వినిమయ డిమాండ్‌ పెరిగి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవడంతోపాటు వ్యా పార, కార్మిక వర్గాలకు ఊతం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మాంద్యం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బయటపడేందుకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ రూపంలో రూ.450 లక్షల కోట్లకుపైగా విలువైన ఉద్దీపనలను ప్రకటించాల్సిన అవసరమున్నదన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నది. నానాటికీ పెరుగుతున్న సమస్యల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నగదు ముద్రణతోపాటు క్వాంటిటేటివ్‌ పద్ధతులపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు వెంటనే దృష్టిసారించాలన్న అభిప్రాయం అనేక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. అమెరికా, జపాన్‌, యూరప్‌లోని మరికొన్ని ధనిక దేశాలతోపాటు టర్కీ, ఇండోనేషియా లాంటి వర్థమాన దేశాలు సైతం తమ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఇప్పటికే నగదును ముద్రిస్తూ పలు చర్యలు చేపడుతున్నాయి. ఇదేవిధమైన చర్యలు మన దేశంలోనూ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి స్పష్టం చేశారు.  క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ద్వారా హెలికాప్టర్‌ మనీని సృష్టించి రాష్ర్టాలను ఆదుకోవాలని కోరారు. ఈ సూచనలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీపై కేంద్రం, రిజర్వు బ్యాంకు ఇకనైనా దృష్టిసారిస్తాయో లేదో వేచిచూడాల్సిందే. 

ఆర్బీఐకే సాధ్యం

కరోనా కాటుతో ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్‌ బ్యాంకులు తమతమ దేశాల్లోని ఆర్థిక సంస్థలకు గణనీయంగా రుణాలిస్తున్నాయి. ఇలాంటి బలమైన ఆర్థిక ఉద్దీపనలు భారత ఆర్థిక వ్యవస్థకూ ఎంతో అవసరం. ఇంతటి భారీ రుణాలను మార్కె ట్‌ అందజేయలేదు. నగదును ముద్రించడం ద్వారా భారీగా నిధులు సమకూర్చడం రిజర్వు బ్యాంకుకే సాధ్యమవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలను లాక్‌డౌన్‌ తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఈ నేపథ్యంలో నగదు చెలామణిని పెంపొందించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విధానాన్ని అనుసరించడమే ఉత్తమమన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది.

దువ్వూరి నోట కేసీఆర్‌ మాట

క్వాంటిటేవ్‌ ఈజింగ్‌ విషయమై సీఎం కేసీఆర్‌ వ్యక్తంచేసిన అభిప్రాయంతో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు కూడా ఏకీభవించారు. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నాయని, ప్రజలకు వైద్యసేవలు, నిత్యావసర వస్తు సరఫరాలు అందజేయడంతోపాటు వారి జీవనోపాధిని కాపాడటంలో రాష్ర్టాలకు కేంద్రం చేయూతనివ్వాలని ఆయన ఉద్ఘాటించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభు త్వం చేసిన సిఫారసులపై కేంద్రం దృష్టిసారించి క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విషయంలో సాహసోపేతమైన విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేశారు.

హెలికాప్టర్‌ మనీతో ప్రజలకు సాధికారత

వస్తు, సేవల కొనుగోలులో ప్రజలకు అసాధారణ రీతిలో సాధికారతను కల్పించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ‘హెలికాప్టర్‌ మనీ’ తోడ్పడుతుంది. దీన్ని సృష్టించేందుకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ఉపకరిస్తుంది. హెలికాప్టర్‌ మనీతో కరెన్సీ నోట్ల సంఖ్య పెరిగి మార్కెట్లోకి మరింత నగదు వస్తుంది. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలంపాటు బాండ్లను సమీకరించేందుకు రిజర్వు బ్యాంకు అనుమతిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటిని ఆర్బీఐ తిరిగి కొనడంతోపాటు అదనంగా కరెన్సీ నోట్లను ముద్రిస్తుం ది. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ద్వారా సృష్టించిన హెలికాప్టర్‌ మనీ.. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు గట్టెక్కేందుకు ఎంతో దోహదపడుతుంది.

నగదు ముద్రణ అంటే..

1.సెంట్రల్‌ బ్యాంక్‌ నేరుగా ప్రభుత్వ, కార్పొరేట్లు, రుణదాతల డెబిట్‌/బాండ్లను కొనుగోలు చేయడం.

దీంతో ఆర్థిక వ్యవస్థలోకి నిధులను చొప్పించడం. తద్వారా ఎలక్ట్రానిక్‌ రూపంలో కూడా నగదు లభ్యత పెరుగడానికి వీలుంటుంది.

ఇతర దేశాలు తీసుకున్న నిర్ణయాలు

అమెరికా ఫెడరల్‌ రిజర్వు: 2008 సంక్షోభం నుంచి బయటపడటానికి భారీగా నగదును ముద్రించింది. ప్రస్తుతం మరో దఫా నగదు ముద్రణకు సిద్ధమవుతున్నది.

యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌: బాండ్ల కొనుగోలుకు సంబంధించి నియంత్రణ ఎత్తివేసింది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌: అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి భారీగా రుణాలిచ్చేందుకు సిద్ధం. 

బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌: ప్రభుత్వ బాండ్లను భారీగా కొనుగోలు చేయడానికి సుముఖత.

భారత్‌ చేయాల్సింది!

1. ఆర్థిక ఉత్తేజానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం

2. వడ్డీరేట్లను స్వల్పంగా పెంచాల్సిన అవసరం

3. నగదు ముద్రణతో భారీగా నిధులు సమకూర్చడం ఆర్బీఐకే సాధ్యం.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెరిగేనా?

దేశంలో రోజురోజుకూ ముదురుతున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా రాష్ర్టాల ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని కూడా ఆయన కోరారు. దేశ ఆర్థిక విధానాలను పరిశీలించేందుకు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.


logo