సోమవారం 01 మార్చి 2021
Business - Jan 16, 2021 , 21:35:52

ముఖేశ్ ‘రిల‌య‌న్స్’కే శ‌ఠ‌గోపం..6.8 కోట్ల చీటింగ్

ముఖేశ్ ‘రిల‌య‌న్స్’కే శ‌ఠ‌గోపం..6.8 కోట్ల చీటింగ్

న్యూఢిల్లీ: ముఖేశ్‌ అంబానీ.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పారిశ్రామిక‌వేత్త‌.. భార‌త్ కుబేరుడు.. రిల‌య‌న్స్ అధినేత‌.. ఆయ‌న క‌నుసైగ‌తో ప్ర‌భుత్వాలే క‌దిలి వ‌స్తాయ‌ని ప్ర‌తీతి. కానీ ముఖేశ్ అంబానీ సార‌థ్యంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌ను ఓ వ్య‌క్తి మోస‌గించారు. ఆ వ్య‌క్తి పేరు క‌ల్పేశ్ ద‌ఫ్తారీ. దీనిపై మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం (పీఎంఎల్ఏ) కింద సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సొంతంగా ద‌ర్యాప్తు చేప‌ట్టింది. క‌ల్పేశ్ ద‌ఫ్తారీతోపాటు మ‌రి కొంద‌రు క‌లిసి విశేష్ క్రుషి అండ్ గ్రామ్ ఉద్యోగ్ యోజ‌న (వీకేజీయూవై) అనే ప్ర‌త్యేక వ్య‌వ‌సాయ గ్రామ ప‌రిశ్ర‌మ‌ల ప‌థ‌కం కింద 13 న‌కిలీ లైసెన్సులు పొందార‌ని ఈ ద‌ర్యాప్తులో తేలింది. 

కంపెనీ బ‌దిలీ పేరిట కుట్ర‌

ఇదే వ్య‌క్తులు హిందూస్థాన్ కాంటినెంట‌ల్ లిమిటెడ్ అనే సంస్థ‌ను రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు విక్ర‌యించారు. అంతే కాదు వీరు పొందిన 13 న‌కిలీ లైసెన్సుల‌ను రూ.6.8 కోట్ల‌కు విక్ర‌యించార‌ని కూడా ద‌ర్యాప్తు సంస్థ‌లు నిర్ధారించుకున్నాయి. ఒక కంపెనీని బ‌దిలీ చేసే పేరిట జ‌రిగే త‌తంగ‌మంతా మోస‌మ‌ని ఎవ్వ‌రూ క‌నిపెట్ట‌లేక‌పోయారు. క‌ల్పేశ్ ద‌ఫ్తారీతోపాటు అహ్మ‌ద్, పీయూష్ వీరంగ‌మ్మ‌, విజ‌య్ గాధియా త‌దిత‌రులు ఈ కుట్ర‌లో పాల్గొన్నార‌న్న సంగ‌తి సీబీఐ, ఈడీ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. 

క‌ల్పేష్ ద‌ఫ్తారీ ఆస్తులు జ‌ప్తు

దీంతో క‌ల్పేష్ ద‌ఫ్తారీకి వ్య‌తిరేకంగా ద‌ర్యాప్తు సంస్థ‌లు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. క‌ల్పేష్ ద‌ఫ్తారీ యాజ‌మాన్యంలో న‌డుస్తున్న సంక‌ల్ప్ క్రియేష‌న్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ. 4.87 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. ముంబైలోని ఒక క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌, గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ న‌గ‌రంలో గ‌ల నాలుగు వాణిజ్య స‌ముదాయాల‌నూ స్వాధీనం చేసుకున్న‌ది. ఇక అవినీతి నిరోధ‌క చ‌ట్టం-1988లోని 13 (2), 13 (1) (డీ) సెక్ష‌న్లు, ఐపీసీలోని 420, 467, 471, 477ఏ సెక్ష‌న్ల కింద క‌ల్పేశ్ ద‌ఫ్తారీపై కేసు న‌మోదైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo