బుధవారం 20 జనవరి 2021
Business - Nov 28, 2020 , 02:54:25

కాలగర్భంలోకి లక్ష్మీ విలాస్‌

కాలగర్భంలోకి లక్ష్మీ విలాస్‌

  • 94 ఏండ్ల ఘన చరిత్ర తెరమరుగు  
  • ఇకపై డీబీఐఎల్‌ శాఖలుగా ఎల్‌వీబీ శాఖలు
  • నష్టాల భయంలో ప్రమోటర్లు, పెట్టుబడిదారులు

న్యూఢిల్లీ: స్వాతంత్య్రానికి పూర్వం నాటి లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) తెరమరుగైంది. తమిళనాడు కేంద్రంగా 94 ఏండ్ల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్యాంక్‌ను సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంక్‌ అనుబంధ సంస్థ డీబీఎస్‌ ఇండియా లిమిటెడ్‌ (డీబీఐఎల్‌)లో విలీనం చేయడంతో దాని ఉనికి కాలగర్భంలో కలిసిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎల్‌వీబీని డీబీఐఎల్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ విలీనం శుక్రవారం (నవంబర్‌ 27) నుంచే అమల్లోకి రావడంతో ఇకపై లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ శాఖలన్నీ డీబీఐఎల్‌ శాఖలుగా పనిచేస్తాయని, ఎల్‌వీబీ కస్టమర్లంతా డీబీఐఎల్‌ పరిధిలోకి వస్తారని రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీనిపై ఎల్‌వీబీ డిపాజిటర్లకు స్పష్టత వచ్చినప్పటికీ ఆ బ్యాంక్‌ ప్రమోటర్లు, ఇతర పెట్టుబడిదారులు మాత్రం నష్టాల భయంతో తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. డీబీఎస్‌ బ్యాంక్‌లో విలీనం కావడానికి ముందే బ్యాంకింగ్‌ నియంత్ర చట్టంలోని 45వ సెక్షన్‌ను అనుసరించి రూ.318 కోట్ల విలువైన టైర్‌-2 బాసెల్‌-3 బాండ్లను రైటాఫ్‌ చేయాలని రిజర్వు బ్యాంక్‌ ఇప్పటికే ఎల్‌వీబీని ఆదేశించింది. ఫలితంగా ఈ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారంతా తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు ఎల్‌వీబీ షేర్లను స్టాక్‌ మార్కెట్ల నుంచి డీలిస్ట్‌ చేయనుండటంతో బ్యాంక్‌ యూనియన్లు సహా ఎంతో మంది భాగస్వాములు ఈ విలీన తీరును ప్రశ్నిస్తున్నారు.

ఎల్‌వీబీని విదేశీ బ్యాంకు శాఖకు అప్పనంగా దారాదత్తం చేశారని తూర్పారబడుతున్నారు. ఈ విషయంలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ఏకంగా రిజర్వు బ్యాంకునే నిందించింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ వైఫల్యంలో ఆర్బీఐ పాపం ఎంతన్న దానిపై లోతైన దర్యాప్తు జరుపాలని డిమాండ్‌ చేసింది. ఎల్‌వీబీని డీబీఐఎల్‌లో విలీనం చేయడమంటే విదేశీ బ్యాంకులను దొడ్డిదారిన భారత మార్కెట్లోకి అనుమతించడమేనని విమర్శిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బుధవారమే ఘాటైన లేఖ రాసింది. ఈ విలీనం.. కేంద్రం ఎంతో ఘనంగా వల్లెవేస్తున్న ఆత్మనిర్భర్‌ భారత్‌ విధానానికి పూర్తిగా విరుద్ధమని ఆ లేఖలో ఏఐబీఈఏ ధ్వజమెత్తింది. అయినప్పటికీ మోదీ సర్కారు ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా ‘దున్నపోతుపై వాన’ పడిన చందంగా వ్యవహరించడం గమనార్హం.logo