ఆదివారం 29 నవంబర్ 2020
Business - Oct 23, 2020 , 02:16:01

జోరుగా స్మార్ట్‌ఫోన్ల దిగుమతి

జోరుగా స్మార్ట్‌ఫోన్ల దిగుమతి

  • జూలై-సెప్టెంబర్‌ మధ్యకాలంలో 5 కోట్ల రాక
  • వీటిలో 76 శాతం వాటా చైనా కంపెనీలదే

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం తర్వాత భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ భారీగా పుంజుకున్నది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ దిగుమతి గరిష్ఠ స్థాయిని తాకినట్టు మార్కెట్‌ పరిశోధనా సంస్థ కానలీస్‌ ప్రకటించింది. గతేడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 4.62 కోట్ల యూనిట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ దిగుమతి ఈసారి 8 శాతం వృద్ధిచెంది 5 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. దేశ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఏడాది క్రితం 74 శాతంగా ఉన్న చైనా కంపెనీల వాటా ఈసారి 76 శాతానికి చేరినట్టు తెలిపింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో నమోదైన 80 శాతం వాటా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. టాప్‌-5 కంపెనీలైన షియోమీ, శాంసంగ్‌, వివో, రియల్‌మీ, ఒప్పో షిప్‌మెంట్లు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారీగా పెరిగినట్టు కానలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నది.

అగ్రస్థానం షియామీదే

  • ప్రస్తుతేడాది మూడో త్రైమాసికంలో షియామీ 26.1 శాతం వాటా (1.31 కోట్ల యూనిట్ల దిగుమతి)తో మార్కెట్‌ లీడర్‌గా నిలిచింది.
  • దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ 20.4 శాతం వాటా (1.02 కోట్ల యూనిట్ల షిప్‌మెంట్ల)తో చైనా కంపెనీ వివోను కిందికి నెట్టి రెండోస్థానాన్ని ఆక్రమించింది.
  • 17.6 శాతం (88 లక్షల యూనిట్ల) మార్కెట్‌ వాటాతో వివో.. 17.4 శాతం (87 లక్షల యూనిట్ల) వాటాతో రియల్‌మీ.. 12.1 శాతం (61 లక్షల యూనిట్ల) వాటాతో ఒప్పో వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. 
  • యాపిల్‌కు కూడా మూడో త్రైమాసికం కలిసొచ్చింది. గతేడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే ఈసారి రెండంకెల వృద్ధితో 8 లక్షల యూనిట్లు దిగుమతి అయ్యాయి.