సోమవారం 01 మార్చి 2021
Business - Jan 26, 2021 , 01:46:01

మూడో రోజూ నష్టాలే

మూడో రోజూ నష్టాలే

సెన్సెక్స్‌ 531, నిఫ్టీ 133 పాయింట్ల పతనం

రూ.2 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

ముంబై, జనవరి 25: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోతున్నాయి. వరుసగా మూడోరోజు సోమవారం సూచీలు భారీగా నష్టపోయాయి. ఐటీ, ఇంధన రంగ షేర్లలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా వెయ్యి పాయింట్ల స్థాయిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 530.95 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టపోయి 48,347.59 వద్ద ముగిసింది. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు మదుపరులు ఒక్కసారిగా అమ్మకాలకు పాల్పడంతో కుదుపునకు లోనయ్యాయి. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 133 పాయింట్లు తగ్గి 14,238.90 వద్దకు జారుకున్నది. స్టాక్‌ మార్కెట్ల భారీ పతనంతో మదుపరుల సంపద క్రమంగా కరిగిపోతున్నది. సోమవారం కూడా మదుపరులు రూ.2.08 లక్షల కోట్ల మేర కోల్పోయారు. దీంతో బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.192.27 లక్షల కోట్లకు పడిపోయింది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 1,444 పాయింట్లు(2.90 శాతం), నిఫ్టీ 405.80 పాయింట్లు(2.77 శాతం) నష్టపోయింది.  పెట్టుబడిదారులు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి. 

పడేసిన రిలయన్స్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మొత్తం మార్కెట్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. ఆర్థిక ఫలితాలు అంచనాలకు చేరుకోకపోవడంతో ఆర్‌ఐఎల్‌ షేరు ధర 5.36 శాతం నష్టపోయింది. దీంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రూ.35 వేల కోట్లకు పైగా సంపాదను కోల్పోయారు. ప్రపంచ కుబేరుల జాబితా టాప్‌-10 నుంచి వైదొలిగారు. ఆర్‌ఐఎల్‌తోపాటు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ల షేర్లు నష్టపోయాయి. కానీ, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. 30 షేర్లలో 21 నష్టపోగా, కేవలం తొమ్మిది లాభపడ్డాయి. 

నేడు మార్కెట్లకు సెలవు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. తిరిగి బుధవారం సూచీలు యథాతథంగా పనిచేయనున్నాయి. దీంతో ఈవారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులపాటు జరుగనున్నది. 

VIDEOS

logo