బుధవారం 03 మార్చి 2021
Business - Jan 22, 2021 , 19:21:20

టెస్లా ఎంట్రీకి లాంగ్ జ‌ర్నీ?!: చార్జింగ్‌, స‌ప్ల‌యి చైన్ నెట్‌వ‌ర్క్ ‘కీ’

టెస్లా ఎంట్రీకి లాంగ్ జ‌ర్నీ?!: చార్జింగ్‌, స‌ప్ల‌యి చైన్ నెట్‌వ‌ర్క్ ‘కీ’

వాషింగ్ట‌న్‌: భార‌త ఆటోమొబైల్ విప‌ణిలోకి రంగ ప్ర‌వేశం చేసేందుకు యూఎస్ ఎల‌క్ట్రిక్ కార్ మేక‌ర్ టెస్లా ముహూర్తం ఖ‌రారు చేసుకున్నా.. పూర్తి స్థాయిలో ఎంట‌ర‌య్యేందుకు టైం తీసుకుంటుంద‌ని భావిస్తున్నారు. విద్యుత్ కార్లలో కీల‌క‌మైన బ్యాట‌రీల‌కు స్థానికంగా ఉత్పాద‌క వ‌స‌తులు లేక‌పోవ‌డం, చార్జింగ్ మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డం, స‌ప్ల‌యి నెట్ వ‌ర్క్ లేమి, విద్యుత్ వాహ‌నాల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌టం కూడా వాటి విక్ర‌యాలు చాలా పేల‌వంగా ఉండ‌టానికి కార‌ణాలుగా ఉన్నాయి. భారత్‌లోని ఇరుకైన రోడ్ల మ‌ధ్య ఖ‌ర్చుతో కూడుకుని ఆటాన‌మ‌స్ డ్రైవింగ్ ఫీచ‌ర్లు గ‌ల టెస్లా కార్లు ఎలా న‌డుస్తాయ‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే క‌నిపిస్తున్న‌ది. 

లోక‌ల్ ప్రొడ‌క్ష‌న్‌కు టెస్లా దిగి వ‌స్తుందా?!

అధిక సంపాద‌న గ‌ల సంప‌న్నులే టెస్లా వంటి కార్ల కొనుగోలుకు ముందుకు వ‌స్తారు.. జ‌న సామాన్యంలోకి వెళ్లాంటే టెస్లా త‌న వ్యూహం మార్చుకోవాల్సిందేనా?! ఆ ప‌ని చేస్తుందా.. స్థానికంగా ఉత్ప‌త్తి చేయ‌డంతో ప్రొడ‌క్ష‌న్ కాస్ట్.. అటుపై కారు ధ‌ర దిగి వ‌స్తుంది.. విద్యుత్ కార్ల‌కు పొటెన్షియ‌ల్ మార్కెట్ భార‌త్‌.. దాన్ని టెస్లా వ‌దులుకుంటుందా?! అంటే లేద‌నే అభిప్రాయ ప‌డుతున్నారు విశ్లేష‌కులు దీనికి తోడు క‌ర్బ‌న ఉద్గారాల‌ను నియంత్రించ‌డానికి విద్యుత్ వాహనాల విక్ర‌యం పెంచాల‌ని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్ నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో పూర్తిగా వెనుక‌బ‌డి ఉన్నామ‌ని తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో 24 ల‌క్ష‌ల విద్యుత్ వాహ‌నాల‌ను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యిస్తే, కేవ‌లం ఐదు వేల వాహ‌నాలే అమ్ముడ‌య్యాయి. విడి భాగాల దిగుమ‌తుల‌పై సుంకాల భారం కూడా అధిక ధ‌ర‌ల‌కు మ‌రో కార‌ణం. 

సంప‌న్నులే ల‌గ్జ‌రీ కారు బ్రాండ్ల‌కు ప్రాధాన్యం

భార‌త్‌లో సినిమా స్టార్లు, అగ్ర‌శ్రేణి బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, అధిక సంపాద‌న క‌ల వ్య‌క్తులు మాత్ర‌మే భారీగా ధ‌ర పెట్టి టెస్లా బ్రాండ్ కార్లు కొనుగోలు చేయ‌డానికి ముందుకు వ‌స్తారు. భార‌త్‌లో ఇటువంటి బ్రాండ్ కార్లు కొనుగోలు చేసేవారు ఎంత‌మంది ఉన్నార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఆటోమోటీవ్ క‌న్స‌ల్టెన్సీ ఎల్ఎంసీ ఆటోమోటివ్ ప్ర‌తినిధి అన్మార్ మాస్ట‌ర్ మాట్లాడుతూ  తొలి ఐదేండ్ల‌లో టెస్లా త‌న మోడ‌ల్‌-3 సెడాన్ వ‌ర్ష‌న్ విద్యుత్ కారును 50-100 యూనిట్లు మాత్ర‌మే విక్ర‌యించ‌గ‌లుగుతుంద‌న్నారు. 

మోడ‌ల్-3 దిగుమ‌తికి టెస్లా ప్లాన్లు

ఈ ఏడాది మ‌ధ్య‌లో భార‌త్‌లో కార్య‌కలాపాలు షూరూ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న టెస్లా.. ఈ నెల ప్రారంభంలో స్థానిక కంపెనీగా పేరు రిజిస్ట‌ర్ చేసుకుంది. తొలి ద‌శ‌లో మోడ‌ల్‌-3 కార్ల‌ను దిగుమ‌తి చేసి భార‌త్‌లో 65 వేల నుంచి 75 వేల డాల‌ర్ల‌కు విక్ర‌యించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని, ఇది అమెరికా ధ‌ర కంటే దాదాపు రెట్టింపు అని టెస్లా వ‌ర్గాల క‌థ‌నం. 

మార్చిలోపు జాగ్వార్ ఐఫేస్ విప‌ణిలోకి..

ఇప్ప‌టికే భార‌త బుల్లి ల‌గ్జ‌రీ విద్యుత్ కార్ల మార్కెట్‌లో ఎంట‌రైన టాటామోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవ‌ర్ (జేఎల్ఆర్‌), మెర్సిడెస్ బెంజ్ కార్ల‌తో పోటీ ప‌డాల్సిన ప‌రిస్థితి టెస్లాది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో మెర్సిడెస్ బెంజ్ ఆవిష్క‌రించిన తొలి ల‌గ్జ‌రీ విద్యుత్ కారు ధ‌ర 1.36 ల‌క్ష‌ల డాల‌ర్లు.. ఇప్ప‌టి వ‌ర‌కు 31 యూనిట్లు మాత్ర‌మే అమ్ముడ‌య్యాయి. ఇక టాటా మోటార్స్ వారి జాగ్వార్ లాండ్ రోవ‌ర్ త‌న ఐ పేస్ ఈవీని వ‌చ్చే రెండు నెల‌ల్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. దీని ధ‌ర అమెరికాలో 75 వేల డాల‌ర్లు. 

టెస్లాకు భార‌త్ రోడ్లు క‌ష్ట‌మే

గ‌తంతో పోలిస్తే భార‌త్ రోడ్ల మౌలిక వ‌స‌తులు మెరుగైనా.. టెస్లా వంటి ఆటోమేటిక్ ఫీచ‌ర్లు గ‌ల కార్లు ప‌రుగులు తీయాలంటే కాసింత క‌ష్ట‌మే మ‌రి. ఈ ప‌రిస్థితుల్లో టెస్లా మోడ‌ల్‌-3 కారు విక్ర‌యాల‌కు 15-20 మంది ఎగ్జిక్యూటివ్‌ల‌ను భార‌త్‌లో నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని అమెరికా టెస్లా సీనియ‌ర్ ప‌బ్లిక్ పాల‌సీ ఎగ్జిక్యూటివ్ రోహ‌న్ ప‌టేల్ స‌న్నిహిత వ‌ర్గాల క‌థ‌నం. అయితే దీనిపై టెస్లా అధికార ప్ర‌తినిధి గానీ, రోహ‌న్ ప‌టేల్ గానీ అధికారికంగా స్పందించ‌లేదు. 

స‌మ‌గ్ర ఈవీ పాల‌సీపై స్ప‌ష్ట‌త లేని కేంద్రం

ప్ర‌పంచంలోకెల్లా అత్యంత కాలుష్య కార‌క న‌గ‌రాలు బోలెడు ఉన్నాయి. కానీ క‌ర్బ‌న ఉద్గారాలను త‌గ్గించి క్లీన్ ఎన‌ర్జీతో వాహ‌నాలు న‌డిపేందుకు చైనాలో మాదిరిగా భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ స‌మ‌గ్ర విధానాన్ని అమ‌లులోకి తేలేదన్న విమ‌ర్శ వినిపిస్తున్న‌ది. బ్యాట‌రీల ధ‌రతోపాటు కార్ల ధ‌ర ప్రియం కావ‌డంతో విద్యుత్ కార్ల త‌యారీపై భార‌త ఆటోమొబైల్ దిగ్గ‌జాలు వెనుక‌డుగు వేస్తున్నార‌ని తెలుస్తున్న‌ది. 

భారీ దిగుమ‌తి సుంకాల‌పై మ‌స్క్ తీవ్ర ఆందోళ‌న‌

భార‌త్‌లో కార్ల దిగుమ‌తిపై భారీ సుంకాలు విధించ‌డం ప‌ట్ల టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రెండు కోట్ల విద్యుత్ వాహ‌నాలు విక్ర‌యించాల‌ని చైనా ల‌క్ష్యంగా పెట్టుకుంటే, 2020లో 12.5 ల‌క్ష‌ల వాహ‌నాలు అమ్ముడ‌య్యాయి. భార‌త్‌లో 20 ల‌క్ష‌ల వాహ‌నాల విక్ర‌య ల‌క్ష్యానికి కేవ‌లం ఐదువేలే విక్ర‌యాలు జ‌రిగాయి. చైనాలో కార్ల విక్ర‌యాల్లో టెస్లాదే అత్య‌ధిక వాటా. గ్లోబ‌ల్ సేల్స్‌లో మూడో వంతు వాటా టెస్లా కొట్టేసింది. 

భార‌త్ స్వీట్ పొటెన్షియ‌ల్‌.. టెస్లా కోరికా అదే

వ‌చ్చే 7-8 ఏండ్ల‌లో భార‌త‌దేశంలో మొత్తం కార్ల విక్ర‌యాల్లో టెస్లా వాటా 5 శాతం ఉండాల‌న్నా.. స్థానికంగా ఉత్పాద‌క‌త ప్రారంభిస్తేనే సాధ్యం అని అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న ఎడ్‌బ‌ష్ సెక్యూరిటీస్ డానియ‌ల్ ఐవ్స్ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పాద‌క యూనిట్‌తోపాటు శ‌క్తిమంత‌మైన స‌ప్ల‌యి చైన్ నిర్మించుకునేందుకు టెస్లా బ‌హుముఖ ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేయాల్సిందేన‌న్నారు. ‘విద్యుత్ కార్ల‌కు భార‌త్ అత్యంత సానుకూల మార్కెట్‌. ఈ సానుకూల‌త‌ను సొమ్ము చేసుకునే విష‌యంలో టెస్లా వెనుక‌బ‌డుతుంద‌నుకోవ‌డం లేదు’ అని డానియ‌ల్ ఐవ్స్ స్ప‌ష్టం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo