బుధవారం 03 మార్చి 2021
Business - Jan 22, 2021 , 00:19:58

లాక్‌డౌన్‌ పొదుపు 14.60 లక్షల కోట్లు

లాక్‌డౌన్‌ పొదుపు 14.60 లక్షల కోట్లు

  • 20 ఏండ్ల గరిష్ఠానికి చేరిక  
  • యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ వెల్లడి

ముంబై, జనవరి 21: ప్రపంచాన్ని వెక్కిరిస్తున్న కరోనా మహమ్మారి యావత్‌ మానవాళిని ఇప్పటికీ పట్టిపీడిస్తున్నది. కానీ ఈ మహమ్మారి తీసుకొచ్చిన లాక్‌డౌన్‌.. ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంచడంలో అనూహ్య విజేతగా నిలిచింది. 2014-19 మధ్య కాలంలో కుటుంబ పొదుపు (హౌస్‌హోల్డ్‌ సేవింగ్స్‌) నిలకడగా తగ్గినప్పటికీ ఆ తర్వాత నుంచి ఇది అదనంగా 200 బిలియన్‌ డాలర్లు (రూ.14,59,898 కోట్లు) పెరిగి 20 ఏండ్ల గరిష్ఠ స్థాయికి ఎగబాకినట్లు ప్రముఖ విదేశీ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈ పొదుపులో అధిక భాగం నగదు రూపంలోనే జరిగిందని, లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఇది గణనీయంగా 135 పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం స్థూల పొదుపులో కుటుంబ పొదుపు వాటా దాదాపు 58 శాతంగా ఉన్నదని, కార్పొరేట్‌ కంపెనీల వాటా కేవలం 32 శాతమేనని ఆ నివేదిక వివరించింది. లాక్‌డౌన్ల సమయంలో కుటుంబాల వ్యయం గణనీయంగా మందగించిందని, ఫలితంగా ఆర్థిక ఆస్తుల్లో అదనపు నికర పొదుపు భారీ స్థాయిలో 200 బిలియన్‌ డాలర్లు పెరిగిందని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా విశ్లేషకులు సునీల్‌ తిరుమలై, దీపోజ్జల్‌ సాహా పేర్కొన్నారు. మొత్తం కుటుంబ పొదుపులో బ్యాంక్‌ డిపాజిట్ల వాటా 14 శాతంగా, ఇన్సూరెన్స్‌/పెన్షన్ల వాటా 14 శాతంగా, ప్రభుత్వ క్లెయిముల వాటా 19 శాతంగా ఉన్నదని వెల్లడించారు. ప్రజల్లో పొదుపు ధోరణి ఇప్పటికీ విస్తృతంగా పెరుగుతున్నదని, ఇది కేవలం ధనికులకు మాత్రమే పరిమితం కాలేదని వారు తెలిపారు.

VIDEOS

logo