మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 23, 2020 , 23:58:17

లాక్‌డౌన్‌ మార్కెట్‌ డౌన్‌

లాక్‌డౌన్‌ మార్కెట్‌ డౌన్‌

  • కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
  • రికార్డు స్థాయిలో సూచీలు పతనం 
  • 45 నిమిషాలు నిలిచిపోయిన ట్రేడింగ్‌
  • 3,935 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌  
  • 1,135 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
  • మూడేండ్లకుపైగా కనిష్ఠానికి దిగజారిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు
  • మదుపరులను ముంచేసిన కరోనా భయాలు 
  • విజృంభిస్తున్న వైరస్‌తో తీవ్ర అమ్మకాల ఒత్తిడి

భయం.. భయం.. భయం.. ఎక్కడ చూసినా కరోనా భయమే.. ఎవరి నోట విన్నా వైరస్‌ గుబులే.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. భారత్‌లోనూ విజృంభిస్తున్నది. ఈ ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర చర్యలు తీసుకుంటున్నా.. చాపకింద నీరులా విస్తరిస్తుండటం కలవరపెడుతున్నది. ఫలితంగా ఆయా రాష్ర్టాల్లో ప్రకటించిన లాక్‌డౌన్‌.. సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుప్పకూల్చింది. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయేమోనన్న భయాలు మదుపరులను వెంటాడాయి.  పెరిగిపోతున్న కేసులు, మరణాల మధ్య తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. దీంతో సూచీలు మునుపెన్నడూ లేని నష్టాలను చవిచూశాయి. ఒకానొక దశలో ట్రేడింగ్‌ను సైతం ఆపేశారు. అయినప్పటికీ సెన్సెక్స్‌ 3,900 పాయింట్లకుపైగా, నిఫ్టీ 1,100 పాయింట్లకుపైగా కోల్పోయాయి. ఈ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.14 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది.

ముంబై, మార్చి 23: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కరోనా వైరస్‌ ప్రకంపనల్ని సృష్టిస్తూనే ఉన్నది. మదుపరుల భయాలు మార్కెట్లను కుప్పకూల్చుతూనే ఉన్నాయి. వైరస్‌ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య పెరిగిపోతుండటం.. సోమవారం భీకర అమ్మకాల ఒత్తిడికి దారి తీసింది. ఉదయం ఆరంభం నుంచే భారీ నష్టాల్లో మొదలైన సూచీలు.. కాసేపటికే 10 శాతానికిపైగా క్షీణించాయి. దీంతో మార్కెట్‌ నిబంధనల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాలపాటు నిలిపివేశారు. అయినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. 11 గంటల సమయంలో మళ్లీ మొదలైన మార్కెట్లు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా పతనమైయ్యాయి. 

చివరకు మునుపెన్నడూ లేని నష్టాలు వాటిల్లగా, మూడేండ్లకుపైగా కనిష్ఠ స్థాయికి సూచీలు దిగజారాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 3,934.72 పాయింట్లు లేదా 13.15 శాతం పడిపోయి 25,981.24 వద్దకు చేరింది. ఒకానొక దశలో 25,880.83 పాయింట్ల వద్దకు పడిపోవడం గమనార్హం. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ కూడా 1,135.20 పాయింట్లు లేదా 12.98 శాతం క్షీణించి 7,610.25 వద్ద నిలిచింది. కేవలం ఒక్కరోజులోనే ఈ స్థాయిలో నష్టాలు నమోదవడం ఇదే తొలిసారి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, బేసిక్‌ మెటీరియల్స్‌, ఇండస్ట్రియల్స్‌, ఆటో సూచీల షేర్లు 16.82 శాతం నష్టపోయాయి. మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ సూచీలు దాదాపు 13 శాతం చొప్పున పతనమైయ్యాయి. బీఎస్‌ఈలో 2,037 షేర్లు నష్టపోగా, 232 షేర్లు లాభపడ్డాయి. 132 షేర్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి. 

భీకర నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు

అంతర్జాతీయంగా పెరుగుతున్న కరోనా మరణాలు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను భీకర నష్టాల్లోకి నెట్టాయి. వైరస్‌ మృతులు 15వేలను దాటడం, బాధితులు 3లక్షలకుపైగానే ఉండటంతో మదుపరులు అమ్మకాలపైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఆసియా మార్కెట్లను ఈ ప్రాణాంతక మహమ్మారి విజృంభించడం కుదిపేస్తున్నది. ఈ క్రమంలోనే హాంకాంగ్‌ సూచీ 4.9 శాతం, చైనా 3.1 శాతం, తైవాన్‌ 3.7 శాతం, సింగపూర్‌ 7.5 శాతం, ఇండోనేషియా 3.8 శాతం, దక్షిణ కొరియా 5.5 శాతం చొప్పున నష్టాలపాలైయ్యాయి. ఫారెక్స్‌ ట్రేడ్‌ దన్నుతో జపాన్‌ మాత్రం 2 శాతం పెరిగింది. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన బ్రిటన్‌ 4.8 శాతం, జర్మనీ 4.6 శాతం, ఫ్రాన్స్‌ 4.4 శాతం చొప్పున క్షీణించాయి. అలాగే న్యూజీలాండ్‌ 7.6 శాతం, ఆస్ట్రేలియా 5.6 శాతం మేర పడిపోయాయి.

రూ.14.22 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటుండటంతో లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోతున్నది. సోమవారం సెన్సెక్స్‌ 3,935 పాయింట్లు పడిపోయిన నేపథ్యంలో బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఈ ఒక్కరోజే రూ.14 లక్షల కోట్లకుపైగా కరిగిపోయింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడి మధ్య రూ.14,22,207.01 కోట్లు దిగజారి రూ.1,01,86,936.28 కోట్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపరులు రూ.3వేల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా, దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ విలువ 28 శాతానికిపైగా నష్టపోగా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లూ పెద్ద ఎత్తునే నష్టాలపాలైయ్యాయి. ‘భారతీయ స్టాక్‌ మార్కెట్లలో ఇది మరో బ్లాక్‌ మండే. కరోనా వైరస్‌ బాధితులు పెరుగుతుండటం.. మార్కెట్‌ సెంటిమెంట్‌ను విపరీతంగా దెబ్బతీసింది. దేశం మొత్తం దాదాపు లాక్‌డౌన్‌ స్థితికి చేరుకోవడం కూడా మదుపరులను భయపెట్టింది’ అని ట్రేడింగ్‌బెల్స్‌ సీనియర్‌ అనలిస్టు సంతోష్‌ మీనా అన్నారు. ఈ నెలలో సెన్సెక్స్‌ దాదాపు 15వేల పాయింట్లు కోల్పోగా, సంపద సుమారు రూ.50 లక్షల కోట్లు హరించుకుపోయింది. 

బక్కచిక్కిన రూపాయి

  • డాలర్‌తో పోల్చితే  ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి పతనం l 76.20 వద్దకు చేరిక

రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి పతనమైంది. డాలర్‌తో పోల్చితే మునుపెన్నడూ లేనివిధంగా సోమవారం ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో 76 మార్కును దాటి నష్టపోయింది. ఈ ఒక్కరోజే భారత కరెన్సీ విలువ రూపాయి క్షీణించింది. అమెరికా కరెన్సీకి మార్కెట్‌లో పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడటం.. రూపాయి ఉసురు తీసింది. కరోనా వైరస్‌ అదుపు కోసం లాక్‌డౌన్‌ దిశగా వెళ్తుండటం.. మాంద్యం భయాలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే రూపాయి విలువ బలహీనపడింది. 76.20 వద్ద స్థిరపడింది. ఉదయం ఆరంభంలోనే 75.90 స్థాయి నష్టాలతో మొదలైన రూపాయి.. ఒకానొక దశలో 76.30కు దిగజారింది. ఆఖర్లో స్వల్పంగా కోలుకుని 76.20 వద్ద నిలిచినట్లు ఫారెక్స్‌ ట్రేడర్లు చెప్తున్నారు. మరోవైపు యూరోతోనూ 80.64 స్థాయికి దిగజారిన రూపాయి విలువ.. బ్రిటన్‌ పౌండ్‌తో 87.42 స్థాయికి క్షీణించింది. జపాన్‌ యెన్‌తో చూస్తే రూపాయి మారకం విలువ 68.19గా ఉన్నది. ఇక ఫ్యూచర్‌ మార్కెట్‌లో క్రితం ముగింపుతో పోల్చితే బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు ధర 5.30 శాతం క్షీణించి 25.55 డాలర్లకు పరిమితమైంది.

52 వారాల కనిష్ఠానికి వెయ్యి స్టాకులు

కార్పొరేట్‌ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి. వరుసగా సోమవారం కూడా వెయ్యికి పైగా కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. వీటిలో టాటా మోటర్స్‌, ఐఆర్‌సీటీసీ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అలాగే ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మ్యాక్స్‌ ఫైనాన్సియల్‌, బంధన్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌ఐఐటీ టెక్‌, బజాజ్‌ ఫిన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కెనరా బ్యాంక్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రోలు ఉన్నాయి. మరోవైపు బ్యాంక్‌ నిఫ్టీ 15 శాతం పతనం చెందగా, ఆటో ఇండెక్స్‌ 12 శాతం కిందకు పడిపోయాయి. బీఎస్‌ఈలో లిైస్టెన షేర్లలో 1,886 షేర్లు పతనమవగా, 191 షేర్లు లాభపడ్డాయి. కానీ 106 షేర్లు మాత్రం యథాతథంగా ఉన్నా యి. యాక్సిస్‌ బ్యాంక్‌ 28 శాతం క్షీణించి టాప్‌ లూజర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫిన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు లు 23 శాతానికి పైగా కోల్పోయాయి. వీటితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయిం ట్స్‌, బజాజ్‌ ఆటో, ఎస్బీఐ, రిలయన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, టైటాన్‌, సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీలు పది శాతానికి పైగా మార్కెట్‌ వాటాను కోల్పోయాయి. ఇన్ఫోసిస్‌, మహీంద్రా, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, నెస్లె ఇండియా, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌ల షేర్లు కూడా పతనం చెందాయి. 

ఆర్‌ఐఎల్‌కి షాక్‌

రిలయన్స్‌ మార్కెట్‌ విలువ మరింత కరిగిపోయింది. షేరు ధర ఏకంగా 13 శాతం పతనం చెందడంతో కంపెనీ విలువ రూ.86 వేల కోట్లు కోల్పోయింది. ఇంట్రాడేలో 14 శాతానికి పైగా పతనం చెందిన షేరు ధర చివరకు 13.37 శాతం పతనంతో రూ.883.85 వద్ద పరిమితమైంది. దీంతో కంపెనీ ఎం-క్యాప్‌ రూ.86,435.91 కోట్లు తగ్గి రూ.5,60,296.16 కోట్లకు జారుకున్నది. గత శుక్రవారం 12 శాతం పెరిగిన కంపెనీ షేరు ధర ఆ మరుసటి రోజే అంతే స్థాయిలో పతనం చెందడం విశేషం.  


logo
>>>>>>