శనివారం 30 మే 2020
Business - May 21, 2020 , 23:53:49

కార్పొరేట్లను కుంగదీసిన లాక్‌డౌన్‌

కార్పొరేట్లను కుంగదీసిన లాక్‌డౌన్‌

  • ఇప్పటికే 25 శాతానికిపైగా క్షీణించిన సంస్థల ఆదాయం
  • భారీగా నష్టపోయిన చిన్న, మధ్యతరహా కంపెనీలు

న్యూఢిల్లీ, మే 21: కరోనా కట్టడికి దేశంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఇప్పటికే కార్పొరేట్‌ సంస్థల ఆదాయం 25 శాతానికిపైగా క్షీణించింది. వీటి వ్యాపార కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకొనేందుకు ఏడాదికిపైగా సమయం పడుతుందని టాప్‌ బిజినెస్‌ మేనేజర్లు ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్‌-19 అండ్‌ యువర్‌ వెల్త్‌' అనే పేరుతో ఆన్‌లైన్‌ పెట్టుబడుల సంస్థ ‘స్క్రిప్‌బాక్స్‌' ఈ సర్వే నిర్వహించింది. లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల కార్పొరేట్‌ కంపెనీలకు ఆదాయపరంగా ఎంత నష్టం వాటిల్లింది? ఆయా కంపెనీల్లో ఎన్ని ఉద్యోగాలను కుదించారు? అనే విషయాలను ఈ సర్వే నిగ్గు తేల్చింది. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో తమ కంపెనీల ఆదాయం ఇప్పటికే 25 శాతానికిపైగా తగ్గినట్టు ఈ సర్వేలో పాల్గొన్న వ్యాపార యజమానుల్లో దాదాపు 67 శాతం మంది వాపోయారు.  లాక్‌డౌన్‌ ముగిసిన నాటినుంచి ఏడాదికిపై సమయం తర్వాత వ్యాపారాలు కుదుటపడవచ్చని 22 శాతం మంది పేర్కొన్నారు. స్క్రిప్‌బాక్స్‌ కస్టమర్లపై ఈ నెల 1 నుంచి 15 వరకు నిర్వహించిన ఈ ఆన్‌లైన్‌ సర్వేలో దాదాపు 1,200 మంది బిజినెస్‌ లీడర్లు పాల్గొన్నారు.

ఉద్యోగాల్లో భారీగా కోతలు

లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారాలు కుదేలై ఆదాయాలు క్షీణించడంతో పలు సంస్థలు ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించాయి. ఇలాంటి కోతలు తమ సంస్థల్లో 25 శాతం కంటే తక్కువ ఉన్నట్టు   సర్వేలో 90 శాతం మంది  వెల్లడించారు. 25 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలను కుదించినట్టు మిగిలిన 10 శాతం మంది బిజినెస్‌ లీడర్లు చెప్పారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోయినట్టు ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఫ్రీలాన్సర్లకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు వెల్లడైంది.


logo