బుధవారం 03 జూన్ 2020
Business - Apr 26, 2020 , 23:33:37

అక్షయ తృతీయ ఆవిరి

అక్షయ తృతీయ ఆవిరి

  • బంగారం కొనుగోళ్లపై లాక్‌డౌన్‌ ప్రభావం
  • కలిసిరాని ఆన్‌లైన్‌ ఆలోచనలు
  • తుడిచిపెట్టుకుపోయిన అమ్మకాలు
  • గతంతో పోల్చితే 95 శాతం క్షీణించిన విక్రయాలు

ముంబై, ఏప్రిల్‌ 26: అక్షయ తృతీయ ఆశల్ని కరోనా వైరస్‌ ఆవిరి చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదివారం నగల వర్తకులు ఆన్‌లైన్‌ అమ్మకాలను అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకపోయింది. ఈసారి విక్రయాలు తుడిచి పెట్టుకుపోయినట్లేనన్న అంచనాలు పరిశ్రమ నుంచి వ్యక్తమవుతున్నాయి. ‘ఈ అక్షయ తృతీయ అమ్మకాలను లాక్‌డౌన్‌ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆభరణాల దుకాణాలు పూర్తిగా మూతబడ్డాయి. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోళ్లు జరుపాల్సిన పరిస్థితి కస్టమర్లకు ఏర్పడింది’ అని ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యుయెల్లరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ పీటీఐతో అన్నారు. ఈ క్రమంలోనే గతం తో పోల్చితే 95 శాతం విక్రయాలు పడిపోవచ్చన్నారు. నిరుడుతో పోల్చితే ధరలు 52 శాతం పెరగడం కూడా కొనుగోళ్లను దెబ్బ తీసింది. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ముఖ్యంగా ప్రైస్‌ లాక్‌ వెసులుబాటును కల్పించారు. బంగారం కొన్నప్పుడు ఏ ధర ఉందో.. అదే ధర నిర్ణీత వ్యవధిదాకా చెల్లుబాటు అవుతుంది. భవిష్యత్తులో ధరలు పెరిగినా పాత ధరకే బంగారాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ ధరలు తగ్గితే మాత్రం తగ్గిన ధరలే వర్తిస్తాయి. ఇలా కస్టమర్లకు లాభం చేకూర్చేలా పలు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. కాగా, లాక్‌డౌన్‌ తర్వాత కూడా నగల అమ్మకాలు ఊపందుకుంటాయన్న అంచనాలు లేవన్న ఆయన.. దీపావళిపైనే ఆశలన్నీ అన్నారు. హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు విశిష్ఠమైన స్థానం ఉన్నది తెలిసిందే. గతేడాది అక్షయ తృతీయ రోజున 33 నుంచి 35 టన్నుల పసిడి అమ్మకాలు జరిగాయి. 

వచ్చేసారి రూ.52వేలకు

వచ్చే అక్షయ తృతీయ నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేలకు చేరవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల మునుపెన్నడూ లేనివిధంగా తులం రూ.47,327ను తాకిన విషయం తెలిసిందే. ఆదివారం రూ.45,620 (ఢిల్లీ) పలికింది. అయితే ధరలు ఎక్కువగా పెరుగడం కూడా అమ్మకాలను దెబ్బ తీస్తుందని వ్యాపారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఐదు నెలల వరకు మార్కెట్‌ మందగమనంలోనే ఉంటుందని వుమ్మిడి బంగారు జ్యుయెల్లర్స్‌ అంచనా వేసింది. పెండ్లిండ్లు తదితర శుభకార్యాలు కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి. సంపన్నులు సైతం ఆడంబరాలకు దూరంగా ఉంటుండటం కొనుగోళ్లను కుదిపేస్తున్నది.


logo