మంగళవారం 26 మే 2020
Business - May 03, 2020 , 02:50:35

ఆటో రంగంలో అయోమయం.. లాక్‌డౌన్‌తో కుదేలైన వ్యాపారం

ఆటో రంగంలో అయోమయం.. లాక్‌డౌన్‌తో కుదేలైన వ్యాపారం

  • కస్టమర్లను ఆకట్టుకునేదెలా?
  • మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగేదెట్లా?

న్యూఢిల్లీ, మే 2:కరోనా వైరస్‌ దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలమైయ్యాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో దేశీయ ఆటో పరిశ్రమ కుదేలైంది. మార్చి నెల కాస్త విక్రయాలు జరిగినా.. ఏప్రిల్‌లో మాత్రం ఒక్క వాహనం కూడా అమ్మలేదు. ఆటో సంస్థలకు ఇలాంటి దుస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. ఈ నెల 17దాకా లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మే నెల అమ్మకాలూ ప్రశ్నార్థకంగా మిగులుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో 2.39 లక్షల వాహనాలు అమ్ముడైయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా రోజుకు రూ.2,300 కోట్లు నష్టపోతున్నామని ఆటో పరిశ్రమ చెప్తున్నది.

భవిష్యత్తుపై లేని భరోసా

కరోనా మహమ్మారి భారత్‌ను ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా కోలుకోలేని దెబ్బ తీసింది. లాక్‌డౌన్‌తో వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్తంభించిపోయాయి. ఫలితంగా ప్రజల ఆదాయ వనరులు తీవ్రంగా ప్రభావితమైయ్యాయి. క్షీణించిన కొనుగోళ్ల శక్తి.. మార్కెట్‌లో డిమాండ్‌కు అవకాశమే లేకుండా చేస్తున్నది. ఆదాయం లేక ఖర్చులకు దూరంగా ఉండాలన్న భావన వినియోగదారుల్లో ఏర్పడుతున్నది. దీంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు భవిష్యత్తుపై భరోసా కనిపించడం లేదు. ప్రధానంగా భారీ లావాదేవీలతో ముడిపడ్డ ఆటో రంగం.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కానరావడం లేదు. దీంతో తయారీ కంపెనీల దగ్గర్నుంచి.. డీలర్ల వరకు లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. ఇప్పటికే డీలర్‌ వ్యవస్థలో జీతాల కోత మొదలైంది. మున్ముందు ఉద్యోగాల తీసివేతలకూ ఆస్కారమున్నది. 

ఏం చేయాలి?

మార్కెట్‌లో నెలకొన్న మందగమనాన్ని జయించాలంటే ఆటో కంపెనీలు ఆకర్షణీయమైన రాయితీలు, వడ్డీలేని రుణాలను వినియోగదారులకు ఆఫర్‌ చేయాలని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడున్న గడ్డు పరిస్థితులు చక్కబడేదాకా లాభాలను వదులుకునైనా వ్యాపార మనుగడపైనే దృష్టి పెట్టాలంటున్నారు. వాహనాల ధరల తగ్గింపు, ఉచిత బీమా, సర్వీసింగ్‌ సదుపాయాలతోపాటు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో కలిసి వడ్డీలేని రుణాలను అందించాలని చెప్తున్నారు. ఇది అవకాశమున్న కొనుగోలుదారులను ఉత్సాహపరుచగలదని అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

దేశ జీడీపీలో ఆటోమొబైల్‌ విక్రయాల వాటా 8 శాతం. ఆటో రంగ పతనం బ్యాంకింగ్‌, బీమా, చమురు, రంగులు, ప్లాస్టిక్స్‌, రబ్బర్‌, స్టీల్‌ తదితర రంగాల పరిశ్రమలను ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ ఒక్క రంగాన్ని ఆదుకుంటే పరోక్షంగా దీని అనుబంధ రంగాలకూ మేలు చేసినట్లేనని చెప్తున్నారు. ఆటో అమ్మకాలు పడిపోవడం వల్ల మార్కెటింగ్‌, ఉత్పాదక రంగాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగే అవకాశాలూ ఉన్నాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికీ ఆదాయం క్షీణిస్తుంది. దీంతో ఆటో రంగానికి ఉద్దీపనల అవసరం ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.logo