l ఆల్‌టైమ్ కనిష్ఠానికి తగ్గించిన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్
l ఆగస్టు 31దాకా ఆఫర్
ముంబై, జూలై 2: గృహ రుణాలపై వడ్డీరేట్లను ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మునుపెన్నడూ లేనివిధంగా తగ్గించింది. రూ.50 లక్షల వరకు హోమ్ లోన్లపై వడ్డీరేటు 6.66 శాతమేనని శుక్రవారం ప్రకటించింది. కొత్త వేతన జీవులకు వచ్చే నెల 31దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉం టుందని పేర్కొన్నది.
రుణ కాలపరిమితిని గరిష్ఠంగా 30 ఏండ్లు పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే రుణగ్రహీతల సిబిల్ స్కోర్, ఇతరత్రా అర్హతలకు లోబడే ఈ వడ్డీరేటును వర్తింపజేస్తామని తెలిపింది.
‘కరోనా ప్రభావం దృష్ట్యా.. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారి కోసం వడ్డీరేట్లను ఆల్‌టైమ్ కనిష్ఠానికి తగ్గించాం. మా ఈ నిర్ణయం మార్కెట్లో నూతనోత్సాహాన్ని తీసుకురాగలదని ఆశిస్తున్నాం’ అని సంస్థ ఎండీ, సీఈవో వై విశ్వనాథ్ గౌడ్ అన్నారు.
కాగా, తమ ఆన్లైన్ యాప్ HomY ద్వారా కూడా కస్టమర్లు హోమ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే అనుమతులనూ పొందవచ్చని సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది.
62 ఏండ్లదాకా ఎల్ఐసీ చైర్మన్‌గిరీ
న్యూఢిల్లీ: ఎల్ఐసీ చైర్మన్ పదవీ విరమణ వయసును కేంద్ర ప్రభుత్వం 62 ఏండ్లకు పెంచింది. ఈ క్రమంలోనే ఎల్ఐసీ ఇండి యా (స్టాఫ్) అమెండ్మెంట్ రూల్స్ 2021 పేరుతో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది.
ఐపీవో నేపథ్యంలో గత నెల్లోనే ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలన్ని 9 నెలలు పొడిగిస్తూ వచ్చే ఏడాది మార్చి 13దాకా తీసుకెళ్లిన సంగతీ విదితమే.